యువతి ఆత్మహత్య కేసులో ఐఆర్ఎస్ అధికారి అరెస్ట్
నోయిడాలోని సెక్టార్ 100 లోటస్ బుల్వేరాడ్ అపార్ట్ మెంట్ లో వీరు ఉండేవారు. ఇదిలా ఉంటే తనను వివాహం చేసుకోవాలని సురభ్ ని కొంతకాలంగా శిల్ప ఒత్తిడి చేస్తూ వచ్చింది.
ఓ యువతి ఆత్మహత్య కేసులో ఐఆర్ఎస్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లపాటు సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా.. అందుకు సదరు ఐఆర్ఎస్ అధికారి తిరస్కరించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో ఐఆర్ఎస్ అధికారి సురభ్ మీనా ఆదాయపు పన్ను విభాగంలో కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు బీహెచ్ఈఎల్ లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న శిల్పా గౌతమ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
వీరిద్దరూ మూడేళ్లపాటు సహజీవనం కూడా చేశారు. నోయిడాలోని సెక్టార్ 100 లోటస్ బుల్వేరాడ్ అపార్ట్ మెంట్ లో వీరు ఉండేవారు. ఇదిలా ఉంటే తనను వివాహం చేసుకోవాలని సురభ్ ని కొంతకాలంగా శిల్ప ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ విషయమై శిల్ప, సురభ్ తరచూ గొడవ పడేవారని శిల్ప తల్లిదండ్రులు తెలిపారు.
సురభ్ తమ కుమార్తెపై పలుమార్లు చేయి కూడా చేసుకున్నట్లు చెప్పారు. వివాహానికి సురభ్ తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన శిల్ప ఈనెల 25న ఆత్మహత్య చేసుకుందని, తమ కుమార్తె మృతికి సురభ్ కారణమని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిల్ప ఆత్మహత్య చేసుకున్న సమయంలో సురభ్ కూడా అక్కడే ఉన్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.