తారాస్థాయికి రూపా- రోహిణి వివాదం.. వ్యక్తిగత ఫొటోలు షేర్
అసలు ఇలా తన ఫొటోలను పురుష ఐఏఎస్ లకు పంపాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఐపీఎస్ రూప మరో అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు.
కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. రెండు రోజులుగా ఈ ఇద్దరి మధ్య వివాదంపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం ఇది వారిద్దరి మధ్య వ్యక్తిగత అంశం అంటూ లైట్ తీసుకున్నారు. దీంతో వీరి వివాదానికి ఎలా పుల్ స్టాప్ పడుతుంది అన్నదానిపై అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న వారిలో ఐపీఎస్ అధికారిణి రూప ఒకరు కాగా, మరొకరు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి.
ముక్కు సూటిగా నిజాయితీగా వ్యవహరిస్తారని పేరున్న రోహిణి సింధూరిపై విమర్శలు, వివాదాలు కూడా తొలి నుంచి అదే స్థాయిలో ఉన్నాయి . గతంలో ఒక ఎమ్మెల్యేతో ఆమె వివాదం పెట్టుకున్నారు. అప్పట్లో ఎమ్మెల్యే, సింధూరి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేతో ఒక రెస్టారెంట్ లో రోహిణి సింధూరి చర్చలు జరుపుతున్నట్టుగా ఉన్న ఒక ఫొటోను ఐపీఎస్ అధికారిణి రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎమ్మెల్యే తో రెస్టారెంట్లో భేటీ ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత రోహిణి సింధూరికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను కూడా ఐపీఎస్ రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ వ్యక్తిగత ఫొటోలను రోహిణి సింధూరి ముగ్గురు పురుష సీనియర్ ఐఏఎస్ లకు స్వయానా పంపించిందని, ఇలా వ్యక్తిగత ఫొటోలను ఐఏఎస్ లకు పంపించడం సర్వీస్ రూల్స్ కు విరుద్ధమంటూ దాడికి దిగారు.
అసలు ఇలా తన ఫొటోలను పురుష ఐఏఎస్ లకు పంపాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఐపీఎస్ రూప మరో అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. గతంలో మైసూరు కలెక్టర్ గా ఉన్న రోహిణి సింధూరిని బదిలీ చేసినప్పుడు దానిపై క్యాట్ లో పిటిషన్ దాఖలవగా ఆమె తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ స్వయంగా వాదనలు వినిపించారని అలాంటి వెసులుబాటు కన్నడిగులైన తమలాంటి వారి బదిలీ విషయంలో ఎందుకు ఇవ్వలేదని రూప ప్రశ్నించారు.
ఈ ఇద్దరు మహిళా అధికారిణిలు బాగా పాపులర్ అయిన వారు కావడంతో వీరి మధ్య వివాదం జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది.
ఐపీఎస్ రూప చేసిన ఆరోపణలపై రోహిణి సింధూరి అంతే గట్టిగా స్పందించారు. తన వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రూపపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. రూప మతిస్థిమితం కోల్పోయారని, ఎప్పుడూ మీడియాలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా తనపై నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తోందని రోహిణి మండిపడ్డారు.
తన వ్యక్తిగత ఫొటోలను తాను ఏ అధికారులకు పంపించానో రూప బయటపెట్టాలని సవాల్ చేశారు. తన వాట్సాప్ స్టేటస్ నుంచి, తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫొటోలను సేకరించి, వాటిని తాను ఇతర ఐఏఎస్ లకు పంపించినట్టు రూప తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం రోహిణి సింధూరి కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్నారు. ఐపీఎస్ రూప హోంగార్డ్స్ ఐజీగా ఉన్నారు.