Telugu Global
National

మూన్ లైటింగ్ ఆదాయం కోసం.. కాదు కాదు పని తక్కువైంది

ఉద్యోగుల వాదనను పలు కంపెనీలు కొట్టిపారేస్తున్నాయి. అధిక ఆదాయం కోసం ఎవరూ మూన్ లైటింగ్ చేయడంలేదని, చేస్తున్న ఉద్యోగంలో పని తక్కువై.. వారు మిగులు సమయాన్ని కొత్త ఉద్యోగాల కోసం కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

మూన్ లైటింగ్ ఆదాయం కోసం.. కాదు కాదు పని తక్కువైంది
X

కరోనా తర్వాత సాఫ్ట్ వేర్ రంగంలో మూన్ లైటింగ్ అనేది సర్వ సాధారణంగా మారింది. ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ఉద్యోగాలు చేయడం, ఒకటి మెయిన్ జాబ్, మరొకటి ఆల్టర్నేట్ జాబ్ గా పెట్టుకోవడం చాలా చోట్ల చూస్తున్నాం. ఆమధ్య మూన్ లైటింగ్ చేస్తున్న ఉద్యోగులపై పెద్ద కంపెనీలు కొరడా ఝళిపించడంతో చాలామంది సర్దుకున్నారు. అసలు మూన్ లైటింగ్ కి కారణం ఏంటి అని తాజాగా వాల్యువోక్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

అధిక ఆదాయం కోసం..

అధిక ఆదాయం కోసమే మూన్ లైటింగ్ చేస్తున్నామని రెండు ఉద్యోగాలు చేస్తున్నవారిలో 27శాతం మంది ఒప్పుకున్నారు. అయితే 37శాతం మంది మాత్రం తమ మొదటి ఉద్యోగం ఊడిపోతే, ప్రత్యామ్నాయంగా రెండో ఉద్యోగం చూసుకుంటున్నామని చెప్పారు. అయితే సర్వేలో అభిప్రాయాలు చెప్పినవారిలో ఐదుగురిలో ఒకరు మాత్రమే మూన్ లైటింగ్ ని ఇష్టపడుతున్నామని అన్నారు. దాదాపుగా 81 శాతం మంది సాధారణ ఉద్యోగులు తమకు అసలు మూన్ లైటింగ్ ఇష్టం లేదని, ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంతోనే సంతృప్తిగా ఉన్నామని చెబుతున్నారు.

కంపెనీలు ఏం చెబుతున్నాయి..?

కంపెనీలు మాత్రం ఉద్యోగుల వాదనను కొట్టిపారేస్తున్నాయి. అధిక ఆదాయంకోసం ఎవరూ మూన్ లైటింగ్ చేయడంలేదని, చేస్తున్న ఉద్యోగంలో పని తక్కువై వారు మిగులు సమయాన్ని కొత్త ఉద్యోగాలకోసం కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. చేతిలో తగినంత పని లేకపోవడం వల్ల ఉద్యోగులు మూన్‌ లైటింగ్‌ కు ఆసక్తి చూపిస్తున్నాయని 31 శాతం సంస్థలు భావిస్తున్నాయి. రెండో ఉద్యోగం చేసుకునేంతగా వారి చేతిలో సమయం ఉంటోందని 23 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి.

క్వైట్ క్విటింగ్..

మూన్ లైటింగ్ తెరపైకొచ్చిన క్రమంలో ఇప్పుడు కొత్తగా క్వైట్ క్విటింగ్ అనేది కూడా ప్రచారంలోకి వచ్చింది. క్వైట్ క్విటింగ్ అంటే.. ఉద్యోగులు పని ఒత్తిడిని అస్సలు తీసుకోరు. యజమాని కోప్పడడు అనేంత వరకు మాత్రమే పనిచేస్తారు. ఆ తర్వాత రిలాక్స్ అవుతారు. అంటే ఉద్యోగంలో అవసరమైనంత మేరకు మాత్రమే కనీస విధులు నిర్వహిస్తారు. క్రమక్రమంగా పని నుంచి తప్పుకుంటారు.

First Published:  22 Nov 2022 3:58 PM IST
Next Story