కొత్త ఏజీగా ముకుల్ రోహత్గీ ఎంపికపై ఆసక్తికర చర్చలు
కేంద్ర ప్రభుత్వం ముకుల్ రోహత్గీ ని నూతన అడ్వకేట్ జనరల్ గా నియమించడంపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఆయన వాదించిన గుజరాత్ అల్లర్లు కేసు నుంచి తాజాగా ఆర్యన్ ఖాన్ కేసు వరకు గల హై ప్రొఫైల్ కేసులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
దేశంలో అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరిగా ఉన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అక్టోబర్ ఒకటిన అటార్నీ జనరల్ (ఏజీ) గా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఏజీ కె.కె.వేణుగోపాల్ ఈ నెలఖారుతో ఆ పదవి నుంచి దిగిపోనుండడంతో రోహత్గీ ఆ పదవిలో చేరనున్నారు. ప్రధాని కోరిక మేరకు ఆయన ఏజీగా చేరేందుకు అంగీకరించారనే వార్తలు వచ్చాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 2014 నుంచి 2017 వరకూ తొలిసారి ఏజి పదవిలో పనిచేశారు. మళ్ళీ ఆయన రెండోసారి ఆ పదవి చేపట్టనున్నారు. ఈ సందర్భంలో ఆయన వాదించిన గుజరాత్ అల్లర్లు కేసు నుంచి తాజాగా ఆర్యన్ ఖాన్ కేసు వరకు గల హై ప్రొఫైల్ కేసులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ విషయంలో బిజెపి ప్రభుత్వం ఏరికోరి రోహత్గీని నియమించడంలో గల ఆంతర్యంపై చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే ప్రతిపక్ష రాష్ట్రాలలో బిజెపి దూకుడుగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను అస్థిరపరుస్తోంది. దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి. మరో వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటువంటి కీలక సమయంలో తమకు దన్నుగా నిలబడి తమ ప్రయోజనాలను కాపాడగలిగేలా బలమైనవాదనలు వినిపించగల దిట్టను బిజెపి నియమించుకుంటోందనే విమర్శలు విన వస్తున్నాయి. రోహత్గీ కి బిజెపి నేతలతో గట్టి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రానున్న రోజుల్లో తమ విధానాలను వివాదం చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళితే వాటిని దీటుగా ఎదుర్కో గల వ్యక్తిని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో రోహత్గీ వాదించిన ముఖ్యమైన కేసుల్లో కొన్నింటిని తెలుసుకుందాం.
2002 గుజరాత్ అల్లర్లు
రాష్ట్రంలో జరిగిన భయంకరమైన అల్లర్ల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అనేక వ్యాజ్యాలను ఎదుర్కొంటున్నప్పుడు, ప్రభుత్వం ముకుల్ రోహత్గీని తీసుకువచ్చింది. అతను అనేక అప్పీళ్లు, తాజా వ్యాజ్యాల ద్వారా రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది.
జస్టిస్ లోయా మృతి కేసు
ప్రస్తుత హోంమంత్రి అమిత్ షాపై న్యాయ విచారణ జరుగుతున్న తరుణంలోనే జస్టిస్ బ్రిజ్‌గోపాల్ హరికిషన్ లోయా మరణించారు. దీంతో ఇది అత్యంత వివాదాస్పద కేసుల్లో ఒకటిగా మారింది. లోయా మరణం గురించి ప్రచారం జరిగిన తర్వాత, ఈ కేసులో అమిత్ షా తరపున వాదించేందుకు ముకుల్ రోహత్గీని రంగంలోకి దింపారు.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబైలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. ఇటీవలి కాలంలో అత్యంత హైప్రొఫైల్ కేసుల్లో ఒకటిగా మారింది. చివరికి ఈ కేసులో క్లీన్ చిట్ పొందిన ఆర్యన్ ఖాన్ తరపున డిఫెన్స్ న్యాయవాదిగా ముకుల్ రోహత్గీ వాదించారు.
విజయ్ మాల్యా మనీలాండరింగ్ కేసు
లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు చేశాయి. ఈ కేసులో బ్యాంకుల కన్సార్టియం తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తూ, ప్రస్తుతం పరారీలో ఉన్న మాల్యాపై పలు అభియోగాలు మోపారు. ఒక దశలో కేసుల చిక్కులు ఎదర్కోలేక మాల్యా రాజీ కి కూడా ఒప్పుకున్నారు. అయితే షరతులు పెట్టారనుకోండి.. అది వేరే విషయం.
ఆర్టికల్ 377కి వ్యతిరేకంగా పిటిషన్
ఏకాభిప్రాయంతో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 377ను నవతేజ్ సింగ్ జోహార్ 2018 సవాలు చేయాలని నిర్ణయించారు. తమ తరపున వాదించేందుకు ఆయన ముకుల్ రోహత్గీ ని ఎన్నుకున్నారు. రోహత్గీ ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనంలో బలంగా వాదించారు. అయితే పిటిషన్‌ని తర్వాత కోర్టు కొట్టివేసింది.