యూపీఐ పేమెంట్స్.. ఆ పని చేస్తే చార్జీల మోతే
గతంలో క్రెడిట్ కార్డ్స్ నుంచి వ్యాలెట్లకు డబ్బులు సులభంగా బదిలీ జరిగేది, ఆ తర్వాత వాటిపై కూడా చార్జీలు విధించారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి వ్యాలెట్లకు చెల్లింపులు చేసినా చార్జీలు కట్టాల్సిందేనంటున్నారు.
ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా చేసే పేమెంట్లకు చార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఒకరి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొకరి బ్యాంక్ అకౌంట్ కి (పీర్ టు పీర్), వస్తువుల కొనుగోలు కోసం చేసే చెల్లింపులపై (పీర్ టు పీర్ మర్చంట్) చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. అయితే అక్కడే ఓ మెలిక పెట్టింది. కొత్తగా ఇంటర్ చేంజ్ చార్జీలను వసూలు చేస్తామని చెప్పింది.
వ్యాలెట్లు, ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్ ల వంటి ప్రీ పెయిడ్ పేమెంట్స్ ఇన్ స్ట్రుమెంట్స్ (PPI) ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై అదనపు చార్జీలు వసూలు చేస్తారు. ఈ లావాదేవీల పరిమితి 2వేల రూపాయలు దాటితే 1.1 శాతం ఇంటర్ చేంజింగ్ చార్జీలు ఉంటాయి. దీనికి సంబంధించి ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏప్రిల్-1నుంచి వీటిని అమలులోకి తేవాలని, ఈ ఏడాది సెప్టెంబరు 30న లేదా అంతకంటే ముందే వీటిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
మర్చంట్ ప్రొఫైల్ ను బట్టి ఇంటర్ ఛేంజ్ ఛార్జీల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని NPCI స్పష్టం చేసింది. ఈ చార్జీలు 0.50- 1.10 శాతం మధ్య ఉంటాయని తెలిపింది. పీపీఐ ద్వారా పెట్రోల్ పంపుల్లో యూపీఐ లావాదేవీ జరిపితే 0.5 శాతం ఇంటర్ ఛేంజ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే స్కూలు, కాలేజీ ఫీజులు చెల్లిస్తే ఇది 0.70 శాతం వరకు ఉంటుంది.
తేడా ఉంటుందా..?
యూపీఐ పేమెంట్లకు చార్జీలు ఉండవు అని కేంద్రం స్పష్టం చేసినా.. ఏప్రిల్-1నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఎక్కడెక్కడ మన జేబుకి చిల్లు పడుతుందో ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పటి వరకూ టోల్ ట్యాక్స్ చెల్లించడానికి పేటీఎం వంటివి ఉపయోగిస్తుంటాం, ఇకపే పేటీఎం వ్యాలెట్ లోకి బ్యాంక్ ఖాతానుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ చెల్లించాలంటే ఇంటర్ ఛేంజ్ ఫీజు కూడా చెల్లించాలి. అయితే ఇక్కడ పేటీఎం ద్వారా లావాదేవీ జరిగినందుకు ఆ సంస్థ ఈ ఫీజు చెల్లించడానికి ఒప్పుకుంటే సరేసరి, లేకపోతే ఆ చార్జీ మన బ్యాంక్ బ్యాలెన్స్ నుంచే కట్ అవుతుంది. అంటే ఇకపై బ్యాంక్ ఖాతానుంచి వ్యాలెట్ కి పంపించే ప్రతి రూపాయిపై పన్ను పడుతుందనమాట.
గతంలో క్రెడిట్ కార్డ్స్ నుంచి వ్యాలెట్లకు డబ్బులు సులభంగా బదిలీ జరిగేది, ఆ తర్వాత వాటిపై కూడా చార్జీలు విధించారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి వ్యాలెట్లకు చెల్లింపులు చేసినా చార్జీలు కట్టాల్సిందేనంటున్నారు. మెల్ల మెల్లగా ఈ చార్జీలను యూపీఐ రోజువారీ లావాదేవీలకు కూడా వర్తిస్తారనే భయం ప్రజల్లో ఉంది. అయితే ఆ భారం ఇప్పుడే వేయడం లేదని ఊరటనిచ్చింది ప్రభుత్వం.