కొవిడ్ టీకా మూడో డోసు తీసుకుంటే బీమా ప్రీమియంలో రాయితీ..
ఆరోగ్య బీమా పాలసీల్లో కొవిడ్ సంబంధిత క్లెయింలు వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఐఆర్డీఏఐ సూచించింది.
భారత్ లో కరోనా భయాల వేళ కొవిడ్ బూస్టర్ డోస్ పై విస్తృత ప్రచారం చేస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చెల్లింపుల్లో కొవిడ్ మూడు డోసులు తీసుకున్న వారికి రాయితీ వర్తింపజేయాలని చూస్తోంది. సాధారణ పాలసీలతోపాటు, హెల్త్ పాలసీల విషయంలో కూడా ఈ నిబంధన వర్తింపజేయాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఆయా బీమా సంస్థలను కోరింది. పాలసీలు రెన్యువల్ చేసుకునే సమయంలో ఈ తగ్గింపు వర్తింపచేసేలా నిబంధనలు తీసుకు రావాలని సూచించింది.
కొవిడ్ క్లెయిమ్ లు వేగంగా పరిష్కరించాలి..
ఆరోగ్య బీమా పాలసీల్లో కొవిడ్ సంబంధిత క్లెయింలు వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఐఆర్డీఏఐ సూచించింది. అంతే కాకుండా పాలసీదారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకునేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కూడా సూచించింది. విదేశీ ప్రయాణ బీమా పాలసీలు రూపొందించేటప్పుడు, అక్కడి కరోనా నిబంధనల గురించి పాలసీదారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పింది.
ఆరోగ్య పాలసీ తీసుకున్న వారు గతంలో కొవిడ్ తో ఆస్పత్రిలో చేరితే అదనంగా చేతి చమురు వదిలించుకున్న సందర్భాలున్నాయి. పూర్తి స్థాయిలో క్లెయిములు పరిష్కారం కాలేదు. అయితే ఈసారి నిబంధనలు సవరించాలని, కొవిడ్ తో ఆస్పత్రిలో చేరినా నగదు రహిత సేవలు అందించేలా చూడాలని ఐఆర్డీఏఐ సూచించింది. పరిస్థితులు ఇబ్బందికరంగా మారితే, కొవిడ్ సంబంధిత క్లెయిమ్ లు వేగంగా పరిష్కరించేందుకు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని బీమా సంస్థలను కోరింది. తప్పుడు క్లెయింలు తగ్గించేందుకు వీలుగా చికిత్స ప్రోటోకాల్ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.