ఇకపై యూపీఐ పేమెంట్లకు కూడా బీమా..
యూపీఐ లావాదేవీల విషయంలో 10వేలరూపాయల వరకు మోసపోయిన సొమ్ముని బీమా క్లెయిమ్ ద్వారా పొందవచ్చు. దీని పరిధిని త్వరలో లక్ష రూపాయలకు పెంచే ఆలోచనలో ఉన్నాయి బీమా సంస్థలు.
ఆన్ లైన్ చెల్లింపుల విషయంలో చాలామంది మోసపోవడం చూస్తూనే ఉన్నాం. యూపీఐ ద్వారా జరిగే చెల్లింపుల విషయంలో వినియోగదారుల అవగాహన రాహిత్యం వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుంది. కొన్నిసార్లు చదువుకున్నవారు, ఉన్నతోద్యోగులు, ఆర్థిక వ్యవహారాల్లో పట్టున్నవారు కూడా ఇలాంటి మోసాలబారిన పడుతుంటారు. అయితే ఇకపై ఆన్ లైన్ పేమెంట్లకు కూడా బీమా వచ్చేస్తుంది. ఆన్ లైన్ ద్వారా జరిగే యూపీఐ లావాదేవీల విషయంలో 10వేలరూపాయల వరకు మోసపోయిన సొమ్ముని బీమా క్లెయిమ్ ద్వారా పొందవచ్చు. దీని పరిధిని త్వరలో లక్ష రూపాయలకు పెంచే ఆలోచనలో ఉన్నాయి బీమా సంస్థలు.
బీమా ప్రీమియం ఎంతంటే..?
యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేవారు పొరపాటున మోసపోతామనే భయం ఉంటే ఏడాదికి బీమా పాలసీ తీసుకోవచ్చు. కేవలం 30 రూపాయల రుసుము చెల్లించి ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది పేటీఎం యాప్ లో అందుబాటులో ఉంది. పేటీఎం యాప్ లో పేమెంట్ ప్రొటెక్ట్ అనే అనే ఆప్షన్ ఎంచుకుని.. పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చేసే యూపీఐ లావాదేవీలకు బీమా వర్తిస్తుంది. అయితే ఏడాదిలో ఒకసారి మాత్రమే మోసపోయిన సొమ్ములో 10వేల రూపాయల వరకు తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది.
త్వరలో లక్ష వరకు..
ప్రస్తుతం 10వేల రూపాయల వరకే ఈ సదుపాయం ఉన్నా.. త్వరలో దీన్ని పెంచేందుకు ఆలోచిస్తున్నామని చెబుతున్నారు HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు. ఏడాదికి లక్ష రూపాయల వరకు నష్టపరిహారం అందించే దిశగా కొత్త పాలసీలు అందుబాటులోకి రాబోతున్నాయి. బీమా పాలసీలతో యూపీఐ పేమెంట్లలో జరిగే మోసాలు తగ్గకపోవచ్చు కానీ, బాధితులకు కాస్త ధీమా పెరుగుతుందని చెప్పొచ్చు.