Telugu Global
National

కోవిడ్‌ కొత్త వేరియంట్‌తో.. వారంతా అప్రమత్తంగా ఉండాలి.. – ఇన్‌సాకాగ్‌ చీఫ్‌ వెల్లడి

ఒమిక్రాన్‌ రకం వల్ల కలిగే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంటతో పాటు వాంతులు, తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌ సోకినవారిలో ఉంటాయని డాక్టర్‌ అరోరా తెలిపారు.

కోవిడ్‌ కొత్త వేరియంట్‌తో.. వారంతా అప్రమత్తంగా ఉండాలి.. – ఇన్‌సాకాగ్‌ చీఫ్‌ వెల్లడి
X

దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 విషయంలో 60 ఏళ్ల వయసు పైబడినవారితో పాటు క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్ర‌స్తులు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని సార్స్‌–కోవ్‌–2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఇన్‌సాకాగ్‌) (ఐNSఅఇౖఎ)చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్‌ వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ విష‌య‌మై అరోరా మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

గతంలో వెలుగు చూసిన ఉపరకానికి, దీనికి మధ్య వ్యాధి లక్షణాల్లో పెద్దగా వ్యత్యాసం లేదని అరోరా తెలిపారు. కొత్త వేరియంట్‌ విషయంలో అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ప్రతి వారం రోజులకూ దేశంలో కొత్త ఉపరకం వస్తుందనే వార్తలు వింటూనే ఉన్నామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 400కు పైగా వేరియంట్లను గుర్తించామని చెప్పారు. ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయని తెలిపారు.

ఒమిక్రాన్‌ రకం వల్ల కలిగే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంటతో పాటు వాంతులు, తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌ సోకినవారిలో ఉంటాయని డాక్టర్‌ అరోరా తెలిపారు. వీటి నుంచి రెండు లేదా ఐదు రోజుల్లో కోలుకోవచ్చని చెప్పారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఆస్ప‌త్రిలో చేరాల్సిన అవసరం రాలేదని ఆయన తెలిపారు. ఈ ఉపరకం గురించి ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని ఆయన చెప్పారు.

మహారాష్ట్రలో కొత్తగా 50 కేసుల నమోదు..

మహారాష్ట్రలో కోవిడ్‌ మహమ్మారి కేసులు కొత్తగా 50 నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే.. వీటిలో కొత్త ఉప రకం జేఎన్‌.1 కేసులు 9 ఉన్నాయని వివరించింది. కొత్త వేరియంట్‌ సోకిన వారిలో థానే నగరంలో ఐదుగురు, పుణేలో ఇద్దరు, పుణే జిల్లాలో ఒకరు, అకోలా సిటీలో ఒకరిలో జేఎన్‌.1 వేరియంట్‌ గుర్తించినట్లు పేర్కొంది. అయితే, ఇప్పటివరకు జేఎన్‌.1 వేరియంట్‌ సోకిన అందరూ కోలుకున్నారని వెల్లడించింది.

First Published:  25 Dec 2023 9:56 AM IST
Next Story