Telugu Global
National

అసెంబ్లీలో ఇంకు పెన్నులపై నిషేధం..

ఇటీవల నల్ల దుస్తులు వేసుకున్నవారిని కొన్ని బహిరంగ సభలకు రానివ్వకుండా అడ్డుకున్న ఉదాహరణలున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంకాస్త విచిత్రంగా ఉంది. జేబులో ఇంకు పెన్ను ఉంటే అతడిని ఆందోళనకారుడిగా గుర్తిస్తున్నారు.

అసెంబ్లీలో ఇంకు పెన్నులపై నిషేధం..
X

మహారాష్ట్ర అసెంబ్లీలో పెన్నులు నిషేధించారు. బాల్ పాయింట్ పెన్నులు తీసుకెళ్లొచ్చు కానీ, పాత లిక్విడ్ ఫౌంటెన్ పెన్నులు, ఇంకు పెన్నులు ఇకపై మహారాష్ట్ర అసెంబ్లీలోకి తీసుకెళ్లకూడదు. అయితే ఎమెల్యేలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇతర సిబ్బంది, జర్నలిస్ట్ లు, అసెంబ్లీలోకి వచ్చే ఇతరులు మాత్రం ఇంకు పెన్నులు తీసుకు రాకూడదు. భద్రతా సిబ్బంది ముందుగానే తనిఖీ చేసి అలాంటి పెన్నులు ఉంటే పక్కనపడేస్తారు.

సహజంగా భద్రతా కారణాల దృష్ట్యా సెల్ ఫోన్లపై నిషేధం విధించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల నల్ల దుస్తులు వేసుకున్నవారిని కొన్ని బహిరంగ సభలకు రానివ్వకుండా అడ్డుకున్న ఉదాహరణలున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంకాస్త విచిత్రంగా ఉంది. జేబులో ఇంకు పెన్ను ఉంటే అతడిని ఆందోళనకారుడిగా గుర్తిస్తున్నారు. ఇటీవల రాజకీయ నాయకులపై ఇంకు చల్లడం ద్వారా నిరసన తెలియజేస్తున్నారని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. మంత్రి చంద్రకాంత్ పాటిల్ పై సిరా దాడి తర్వాత మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర శాసనసభలో అదనపు భద్రతా జాగ్రత్తలను అమలు చేసింది.

బీజేపీ నాయకుడు, విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత ఆయనపై ఇంకు దాడి జరిగింది. ఈ దాడికి బాధ్యులుగా చేస్తూ కొంతమంది పోలీసుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది, ఒక జర్నలిస్ట్ కూడా అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత విడుదలయ్యారు. సిరా దాడి తర్వాత పాటిల్ ఫేస్ మాస్క్ లతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన చుట్టూ రక్షణ మరింత పెంచారు. అయితే సిరా దాడిపై మాత్రం ఆయన సీరియస్ అయ్యారు. పొరపాటున ఆ సిరా తన కళ్లలోకి వెళ్లి ఉంటే క్యాన్సర్ వచ్చి ఉండేదని అన్నారాయన. గతంలో చాలా చోట్ల ఇలాంటి సిరా నిరసనలు జరిగినా.. పాటిల్ పై జరిగిన దాడితో కలకలం రేగింది. అటు తిరిగి, ఇటు తిరిగి ఈ వ్యవహారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఇంకు పెన్నుల నిషేధం వరకు వెళ్లింది.

First Published:  21 Dec 2022 11:11 AM IST
Next Story