Telugu Global
National

అంబేద్కర్, పూలేలపై వ్యాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై సిరా దాడి

ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. మంత్రి పాటిల్ అంబేద్కర్, పూలేలపై చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

అంబేద్కర్, పూలేలపై వ్యాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై సిరా దాడి
X

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలేలపై వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి చంద్ర కాంత్ పాటిల్ పై ఓ దుండగుడు సిరా దాడి చేశాడు. శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి చంద్ర కాంత్ పాటిల్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి కోసం అప్పట్లో బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే ప్రభుత్వ నిధులను కోరేవారుకారన్నారు. ప్రజలే ఒక్కటిగా నిధులు కోసం యాచించేవారని అన్నారు. కాగా మంత్రి 'యాచించారు' అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

ఇదిలా ఉంటే శనివారం పూణే జిల్లా పింప్రీ చించ్ వాడ్ నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి మంత్రి చంద్ర కాంత్ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడే సమయంలో ఓ వ్యక్తి సిరాతో మంత్రిపై దాడి చేశాడు. మంత్రిపై సిరా చల్లిన వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. పూలే, అంబేద్కర్‌పై మంత్రి పాటిల్ చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. మంత్రి పాటిల్ అంబేద్కర్, పూలేలపై చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అప్పటి కాలంలో ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా డబ్బు సమకూర్చుకొని పాఠశాలలను అభివృద్ధి చేసుకునేవారని.. ఇప్పుడు కూడా ప్రజలే నిధులు సమకూర్చుకోవాలని మంత్రి వ్యాఖ్యల ఉద్దేశం అని వివరించారు. పాటిల్ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలని దేవేంద్ర ఫడ్నవిస్ కోరారు.

First Published:  11 Dec 2022 7:17 AM GMT
Next Story