Telugu Global
National

నాడు టమాటా.. నేడు ఉల్లి..! - కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ధర

దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్‌ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో వాటికి కొరత ఏర్పడింది.

నాడు టమాటా.. నేడు ఉల్లి..!  - కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ధర
X

మొన్నటివరకు టమాటా ధర ఆకాశాన్నంటడంతో దేశవ్యాప్తంగా సామాన్య జనం ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా టమాటా ధ‌ర‌ చర్చనీయాంశమైన విషయమూ అందరికీ విదితమే. కేజీ టమాటా ధర అప్పట్లో రూ.200 పైగా పలకడంతో సామాన్యులు టమాటా కొనాలంటేనే అల్లాడిపోయారు. ఇప్పుడు ఉల్లి వంతు వచ్చింది. దాదాపు నెల రోజుల క్రితం వరకు వంద రూపాయలకు 6 కేజీలు మార్కెట్లో లభించేవి. ఇప్పుడు రూ.100కు కేజీన్నర ఉల్లిపాయలు మాత్రమే లభిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్యుల పరిస్థితి మరోసారి ఇబ్బందికరంగా మారింది.

కేజీ రూ.60 నుంచి రూ.70 వరకు...

హైదరాబాద్‌ మార్కెట్లలో కిలో ఉల్లిపాయలను రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఉల్లిపాయ కోయకుండానే సామాన్యులతో కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి ఏర్పడింది. రానున్నది దీపావళి పండుగ సీజన్‌ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి.

కారణం ఏంటంటే..

దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్‌ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వర్షాలు సరిగాలేక కర్నూలు, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. నగరానికి రావాల్సిన 80 నుంచి 100 లారీల ఉల్లి పంటలో కేవలం 20 శాతం మాత్రమే వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. గత 15 రోజులుగా, నిల్వ ఉంచిన ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40 శాతం తగ్గాయని అంటున్నారు. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్‌ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

First Published:  27 Oct 2023 12:59 PM IST
Next Story