Telugu Global
National

ఇండో -చైనా ఘర్షణలు: కేంద్రం మౌనం పై సోనియా ధ్వ‌జం !

ఇటువంటి తీవ్రమైన జాతీయ ఆందోళనపై పార్లమెంటరీ చర్చకు అనుమతి నిరాకరించడం మన ప్రజాస్వామ్యాన్ని అగౌర‌వ‌ప‌ర్చ‌డ‌మే. ఇది ప్రభుత్వ ఉద్దేశాలను పేలవంగా ప్రతిబింబిస్తుంది. ఇది దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో దాని అసమర్థతను తెలుపుతోంది అని సోనియా అన్నారు.

ఇండో -చైనా ఘర్షణలు: కేంద్రం మౌనం పై సోనియా ధ్వ‌జం !
X

భారత్‌-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంటులో చర్చకు అనుమతించకపోవడంపై కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ బుధ‌వారంనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు, తీవ్రమైన ఆందోళన కలిగించే విషయాలపై మౌనం వ‌హించ‌డం ఆన‌వాయితీగా, ప్రభుబుత్వ ల‌క్ష‌ణంగా మారిందని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. ఒక ముఖ్యమైన జాతీయ సవాలును ఎదుర్కొంటున్నప్పుడు, పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవ‌డం మన దేశంలో సంప్రదాయమని అన్నారు. చర్చల ద్వారా అనేక క్లిష్టమైన ప్రశ్నలకు స‌మాధానాలు ల‌భించే అవ‌కాశం ఉంటుంద‌ని ఆమె అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

ఏం జ‌రుగుతుందో, ఏమేం చ‌ర్య‌లు తీసుకుంటున్నామో ప్ర‌జ‌ల‌కు వివరించడం ప్ర‌భుత్వ బాధ్య‌త అని సోనియా అన్నారు.

"ఇటువంటి తీవ్రమైన జాతీయ ఆందోళనపై పార్లమెంటరీ చర్చకు అనుమతి నిరాకరించడం మన ప్రజాస్వామ్యాన్ని అగౌర‌వ‌ప‌ర్చ‌డ‌మే. ఇది ప్రభుత్వ ఉద్దేశాలను పేలవంగా ప్రతిబింబిస్తుంది. ఇది దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో దాని అసమర్థతను తెలుపుతోంది. విభజన విధానాలను అనుసరించడం ద్వారా, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, మన సమాజంలోని కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా దేశాన్ని ఒక్కటిగా నిలప‌డం ప్రభుత్వానికి కష్టతరం అవుతుంది. "అని సోనియా అన్నారు.

ఇలా విభజిత విధానాల వ‌ల్ల బ‌ల‌హీన‌ప‌డ‌డ‌ల‌మే త‌ప్ప దేశానికి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. క్లిష్ట స‌మ‌యాల్లో దేశ ప్ర‌జ‌లంద‌ర్నీ ఏకం చేయాల్సిన బాధ్య‌త ప్రభుత్వానిదే అన్నారు. కానీ ఏడేళ్ళుగా ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా విభ‌జ‌న, విద్వేష విధానాలు అవ‌లంబిస్తోంద‌ని ఆమె విమ‌ర్శించారు.

విప‌క్షాలు స‌హా ప్ర‌శ్నించే గొంతుల‌ను ప్ర‌భుత్వం అణ‌చివేస్తోంద‌ని, మీడియాను నియంత్రిస్తూ చెప్పుచేతుల్లో ఉంచుకుంటోంద‌ని సోనియా విమ‌ర్శించారు. కేంద్రంలోనే కాదు ఆ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల‌లో కూడా ఇదే తంతు జ‌రుగుతోంద‌ని ఆమె అన్నారు. ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ స్థాయిని ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు.

"మనపై నిరంతరం దాడి చేయడానికి చైనా ఎందుకు ధైర్యం చేస్తోంది? ఈ దాడులను తిప్పికొట్టడానికి ఎలాంటి ప్ర‌య‌త్నాలు జరిగాయి, ఇంకా ఏమేమి చేయ‌బోతున్నారు? భవిష్యత్తులో చొరబాట్ల నుండి చైనాను నిరోధించడానికి ప్రభుత్వ విధానం ఏమిటి? ప్ర‌పంచ దేశాల‌తో ఎటువంటి దౌత్య ప‌రమైన చ‌ర్య‌లు తీసుకున్నార‌ని సోనియా ప్ర‌బుత్వాన్ని సూటిగా నిల‌దీశారు.

First Published:  21 Dec 2022 3:41 PM IST
Next Story