Telugu Global
National

కొంప ముంచిన చాట్ జీపీటీ.. భారతీయుల డేటా లీక్

ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ లేని విధంగా భారత్ లో 12,632మంది సమాచారం లీక్ అయినట్టు గ్రూప్‌-IB సంస్థ చెబుతోంది. ఆ తర్వాత పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది.

కొంప ముంచిన చాట్ జీపీటీ.. భారతీయుల డేటా లీక్
X

చాట్ జీపీటీ కొంప ముంచింది. చాట్ బాట్ ని వినియోగించుకునేందుకు లాగిన్ అయ్యే సమయంలో వివరాలు సమర్పించిన నెటిజన్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వారి డేటా మొత్తం లీక్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా చాట్ జీపీటీ యూజర్ల డేటా లీక్ అయినట్టు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గ్రూప్‌-IB తెలిపింది. ఈ లీకు బాధితుల్లో భారతీయలే అధికంగా ఉండటం విశేషం.

చాట్ జీపీటీ నుంచి సమాచారం సేకరించాలంటే ముందుగా లాగిన్ అవ్వాలి. పేరు, ఊరు, ఈమెయిల్ ఐడీ.. ఇతర వివరాలు నమోదు చేస్తేనే లాగిన్ డిటెయిల్స్ వస్తాయి. దీనికోసం చాలామంది చాట్ జీపీటీని టెస్ట్ చేసేందుకు లాగిన్ అయ్యారు. అయితే ఆ డేటా అంతా భద్రంగా ఉంటుందనుకోవడం పొరపాటు అని ఇప్పుడు తేలిపోయింది. చాట్ జీపీటీ ఖాతాలు హ్యాకింగ్ కి గురయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా చాట్ జీపీటీ ఖాతాలు డార్క్ వెబ్ లో కనపడుతున్నాయి. డార్క్ వెబ్ అనేది అక్రమాలకు అడ్డా. అలాంటి చోటకు చాట్ జీపీటీ ఖాతాలు తరలి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.

12వేలమంది భారతీయుల ఖాతాలు లీక్..

ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ లేని విధంగా భారత్ లో 12,632మంది సమాచారం లీక్ అయినట్టు గ్రూప్‌-IB సంస్థ చెబుతోంది. ఆ తర్వాత పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. పాక్ కి చెందిన 9,217 మంది అకౌంట్లు హ్యాకింగ్ కి గురయ్యాయి. గ్రూప్‌-IB ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ప్రకారం, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో చాట్‌ జీపీటీ ఖాతాల సమాచారం లీక్ అయింది. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టారు.

ఈమెయిల్ క్లైంట్ లు, వెబ్ బ్రౌజర్లు, మెసెంజర్ యాప్ లు, గేమింగ్, క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ సమాచారమంతా డార్క్ వెబ్ సేకరిస్తుంది. మాల్వేర్ ద్వారా ఈ లాగ్ సమాచారమంతా డార్క్ వెబ్ లోకి వచ్చేస్తుంది. గ్రూప్‌-IB హెచ్చరికలతో ఇప్పుడు చాలామంది చాట్ జీపీటీ అకౌంట్లను క్లోజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని చెబుతోంది గ్రూప్‌-IB.

First Published:  23 Jun 2023 1:03 PM IST
Next Story