Telugu Global
National

ధనవంతుల పెట్టుబడి సాధనాలు ఏంటో తెలుసా..?

ధనవంతులు ఇలా ఆలోచించరు అని చెబుతోంది నైట్ ఫ్రాంక్ సర్వే. ధనవంతుల పెట్టుబడుల్లో కేవలం 6 శాతం మాత్రమే బంగారంపై ఉంటుంది. 25శాతం మాత్రమే రియల్ ఎస్టేట్ లో పెడతారు.

Indian rich people investment plans
X

ధనవంతుల పెట్టుబడి సాధనాలు ఏంటో తెలుసా..?

ధనవంతులుగా మారాలంటే ఏం చేయాలి..? ఎలాంటి వ్యాపారాలు చేయాలి, లాభాలు వచ్చిన తర్వాత వాటిని దేంట్లో పెట్టుబడులుగా ఉంచాలి. నష్టాలు రాకుండా ఎల్లకాలం ధనవంతులుగానే ఉండాలంటే సురక్షితమైన పెట్టుబడి సాధనాలేంటి..? ఇలాంటి వాటిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే ధనవంతులుగా మారాలంటే అంటూ.. సలహాలివ్వడం వేరు. అసలు ఆ ధనవంతుల జీవిత విధానాన్ని స్టడీ చేయడం వేరు. అలా ధనవంతుల జీవన విధానాన్ని, వారి అలవాట్లను, వారి పెట్టుబడి మార్గాలను అన్వేషించి ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ సంస్థ ఓ సర్వే చేపట్టింది. దీనిలో ఆసక్తికర విషయాలను ఆ సంస్థ విడుదల చేసింది.

పెట్టుబడిలో అధిక భాగం మార్కెట్ లోనే..

పొలాలు కొంటే రేట్లు పెరుగుతాయి, స్థలాలు కొంటే రేట్లు పెరుగుతాయి, బంగారం కొంటే కూడా పెట్టుబడికి ఢోకా ఉండదు. సహజంగా మధ్యతరగతి ఆలోచనలు ఇలానే ఉంటాయి. కానీ ధనవంతులు ఇలా ఆలోచించరు అని చెబుతోంది నైట్ ఫ్రాంక్ సర్వే.


ధనవంతుల పెట్టుబడుల్లో కేవలం 6 శాతం మాత్రమే బంగారంపై ఉంటుంది. 25శాతం మాత్రమే రియల్ ఎస్టేట్ లో పెడతారు. బాండ్ల రూపంలో 10శాతం, వెంచర్ క్యాపిటల్ రూపంలో 10శాతం ఉంటుంది. ఇతర పెట్టుబడి మార్గాలు పోను.. దాదాపుగా 34 శాతం మొత్తాన్ని ఈక్విటీల్లో పెడతారు. అంటే షేర్ మార్కెట్ లోనే ధనవంతుల పెట్టుబడి ఎక్కువ. ‘ద వెల్త్‌ రిపోర్ట్‌ అవుట్‌ లుక్‌ 2023’ పేరుతో ఈ సర్వే విడుదలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నా కూడా భారత దేశంలో 2022లో 88శాతం మంది ధనవంతుల సంపద భారీగా పెరిగింది. గతేడాది 10 శాతానికి పైగా తమ సంపద పెరిగినట్టు 35 శాతం భారతీయ ధనవంతులు తెలిపారు. ఈ ఏడాది కూడా తమ సంపద కనీసం 10 శాతం వృద్ధి చెందుతుందని 53 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు.

మన దేశంలో అధిక ధనవంతులుగా ఉన్నవారు.. ఒక్కొక్కరు 5 చోట్ల పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. భారత్ లోనే కాదు.. యూఏఈ, యూకే, అమెరికాలో కూడా ధనవంతులు తమకు పెద్ద పెద్ద భవంతులు, వేర్వేరు ప్రాంతాల్లో ఉండటాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు.

First Published:  17 Jan 2023 11:19 AM IST
Next Story