రైల్వేలో 20 వేల ఉద్యోగాల నోటిఫికేషన్.. ఫేక్ ప్రకటన - స్పష్టం చేసిన రైల్వే శాఖ
తాజాగా ప్రచారం చేస్తున్న ఫేక్ నోటిఫికేషన్ కూడా వారి కార్యకలాపాల్లో భాగమేనని రైల్వే అధికారులు తెలిపారు. నిరుద్యోగులను నమ్మించి వారినుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారని వివరించారు.
రైల్వే శాఖలో 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. రైల్వే శాఖ అలాంటి నోటిఫికేషన్ ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఒకవేళ జారీ చేస్తే.. అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో పాటు, ప్రెస్‌నోట్ కూడా విడుదల చేస్తామని వివరించింది.
నిరుద్యోగులను నమ్మించి వారినుంచి డబ్బులు దండుకునేందుకు మోసగాళ్ల ముఠా తప్పుడు ప్రచారమే ఈ నోటిఫికేషన్ రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రైల్వే జాబ్ కుంభకోణాన్ని ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW) ఛేదించింది. నిరుద్యోగులను మోసం చేసి ఓ ముఠా తమిళనాడులోని 28 మంది నుంచి రూ.2.68 కోట్లు వసూలు చేసిందని వెల్లడించింది.
ఆ కేసులో ముఠాతో సంబంధం ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కోయంబత్తూరుకు చెందిన వికాస్ రానా, ఢిల్లీకి చెందిన గోవింద్ పూరి ఉన్నారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితులు.. అనంతరం వారిని శిక్షణ పేరుతో ఢిల్లీ రైల్వేస్టేషన్‌లోని వివిధ ప్లాట్‌ఫారాలపై కూర్చోబెట్టి.. వచ్చేపోయే రైళ్ల రాకపోకలను లెక్కించమని చెబుతారని పోలీసులు తెలిపారు. ఇలా రెండు నెలలు గడిచే లోపు తమకు రావాల్సిన మొత్తాలను రాబట్టుకుని ఉడాయిస్తారని వివరించారు.
తాజాగా ప్రచారం చేస్తున్న ఫేక్ నోటిఫికేషన్ కూడా వారి కార్యకలాపాల్లో భాగమేనని రైల్వే అధికారులు తెలిపారు. నిరుద్యోగులను నమ్మించి వారినుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారని వివరించారు. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వారిని నమ్మొద్దని రైల్వే అధికారులు సూచించారు. ఏ వివరాలకైనా రైల్వే శాఖ అఫీషియల్ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసుకోవాలని కోరారు.