Telugu Global
National

సోనియాను పక్కన పెట్టి రిషిని భుజానికి ఎత్తుకుంటాం.. - ఇదెక్కడి హిపోక్రసీ?

ఎంత భారత మూలాలు ఉన్నప్పటికి.. తన దేశానికి ప్రధాని అయిన తర్వాత.. తనను నమ్మిన దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? లేక తన మూలాలున్న దేశానికి ప్రయారిటీ ఇస్తారా?

సోనియాను పక్కన పెట్టి రిషిని భుజానికి ఎత్తుకుంటాం.. - ఇదెక్కడి హిపోక్రసీ?
X

భావోద్వేగం తప్పు కాదు. కానీ.. బాగున్నప్పుడు అందరూ మనోడే అనుకునే వ్యక్తి.. బాగోలేనప్పుడు.. పెద్దగా గుర్తింపు లేనప్పుడు గుర్తించని వైనాన్ని మర్చిపోకూడదు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా అయిన వ్యక్తి.. తన మూలాల్లో భారత్ ఉండటాన్ని అతడెంత వరకు గుర్తుంచుకుంటాడు? అన్నది ప్రధాన ప్రశ్న. బ్రిటన్ ప్రధానమంత్రిగా సునాక్ బరిలో ఉన్నప్పుడు.. తాజాగా ప్రధాని అయినప్పుడు మనోడే.. మనోడే అంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు.. చివరకు మీడియా సైతం పూనకం వచ్చినట్లుగా ఊగిపోవటం.. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి.. అప్పట్లో మనోళ్లను పాలించిన తెల్లోళ్లను.. ఇప్పుడు మనమే పాలిస్తున్నంత ఫీలింగ్ ను ప్రదర్శించటాన్ని మర్చిపోలేం.

ఎంత భారత మూలాలు ఉన్నప్పటికి.. తన దేశానికి ప్రధాని అయిన తర్వాత.. తనను నమ్మిన దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? లేక తన మూలాలున్న దేశానికి ప్రయారిటీ ఇస్తారా? అన్న దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనికి సమాధానం చెప్పేందుకు మనమే ఒక ఉదాహరణ. హైదరాబాద్ లో ఉండే లక్షలాది మంది నేపథ్యం.. ఊరే అవుతుంది. ఊరిని వదిలేసి.. మహానగరానికి రావటం.. ఇక్కడే స్థిరపడిపోవటం.. కెరీర్ లో దూసుకెళ్లేందుకు తెగ కష్టపడటం తెలిసిందే. ఏదైనా సాధించినంతనే మన ఊరోడే అంటూ చంకలు కొట్టేసుకునే దానికి.. తాజాగా జరుగుతున్న దానికి పెద్ద తేడా అయితే లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తన స్థాయిని ఊరోళ్లు గుర్తించినప్పుడు మనకు కలిగే ఆనందానికి కంటే కూడా తక్కువగానే సునాక్ కు కలిగి ఉంటుంది. ఎందుకంటే.. ఇవాల్టి రోజున భారతీయులంతా మనోడే అనుకుంటూ కొత్త బంధాన్ని కలుపుకోవటానికి ముందు అతనికి ఎదురైన సవాళ్ల వేళ.. భారత్ కానీ.. భారతీయులు కానీ ఎవరూ నిలబడలేదన్న నిజాన్ని ఒప్పుకోవాలి. అలాంటప్పుడు తన తాతల కాలం నాటి జాతీయత గురించి.. వారి దేశం గురించి అంతగా గుర్తు పెట్టుకుంటారని అనుకోలేం. అలా అయితే.. ఆయన చేపట్టిన పదవికి ఆయన తప్పు చేసినట్లే.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రస్తావన తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైనట్లే. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి.. భారత్ కు ఆమె వచ్చే నాటికి ఆమె అత్తగారు దేశ ప్రధానిగా తిరుగులేని స్థానంతో పాటు.. ఆమె కుటుంబానికి దేశ ప్రజల్లో ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అలాంటి ఆమె గతంలో ఏం చేశారన్నది పక్కన పెడితే.. భారతీయతకు నిలువెత్తు రూపంగా నిలవటమేకాదు.. తన భర్త.. ఆయన కుటుంబ ధర్మాన్ని ఆమె పాటిస్తూనే వచ్చారు.

మరి.. అలాంటి సోనియాకు భారత ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పుడు మనం ఎలా వ్యవహరించాం? అప్పుడు సోనియాను వేరుగా చూశాం. అంత మాత్రానికే ఆమె తాను పుట్టిన ఇటలీని తన తొలి ప్రాధాన్యతగా భావిస్తూ ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నారా? అంతదాకా ఎందుకు.. మన్మోహన్ ప్రభుత్వానికి తాను రిమోట్ అయిన పదేళ్ల కాలంలోనూ.. ఇటలీకి ఆమె పెద్దపీట వేయటం.. ఆ దేశంతో సన్నిహిత సంబంధాల్ని మొయింటైన్ చేశారా? అంటే లేదనే మాటే వస్తుంది.

ఇప్పుడు సునాక్ విషయంలోనూ అదే జరుగుతుంది. ఆ మాటకు వస్తే.. భారత్ విషయంలో ఆయన మిగిలిన వారి కంటే మరింత కచ్ఛితంగా ఉండొచ్చు. ఎందుకంటే.. తన మూలాల మీద ఎవరోఒకరు ఏదో ఒక వ్యాఖ్య చేస్తారు కాబట్టి.. ఆ అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడాలన్న విషయం ఆయనకు తెలుసు. ఆ మాటకు వస్తే.. సునాక్ కారణంగా భారత్ కు మేలు కంటే కూడా అంతో ఇంతో నష్టమే జరుగుతుంది.

దీనికి కారణం.. భారత్ విషయంలో ఏ మాత్రం సానుకూలంగా వ్యవహరించినా.. అది ఆయన వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించేలా చేయటమే కాదు.. నమ్మి అత్యున్నత పదవిలో కూర్చోబెట్టిన దేశానికి.. దేశ ప్రజలకు ధోకా ఇచ్చినట్లు అవుతుంది. అందుకే.. మిగిలిన బ్రిటన్ ప్రధానమంత్రుల కంటే కూడా ఆయన కాలంలో భారత్ కు మేలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉండొచ్చు. అంటే.. మనోడు.. మనల్ని వందల ఏళ్లు పాలించిన దేశానికి ప్రధానమంత్రి అయ్యారన్న తుత్తి మనకే తప్పించి.. అతగాడికి ఏమీ ఉండదన్న నిజాన్ని గుర్తించాల్సిందే. భావోద్వేగం తప్పు కాకపోవచ్చు. కానీ.. భావోద్వేగపు బంధంలో సునాక్ ను చూడటం తప్పే అవుతుంది. ఎందుకంటే.. ఆశించిందేదీ జరగదు కాబట్టి.

First Published:  26 Oct 2022 11:35 AM IST
Next Story