Telugu Global
National

పొదుపు తగ్గింది, అప్పులు పెరిగాయి.. భారతీయుల తీరు మారింది

పొదుపు చేసిన డబ్బుల్ని బ్యాంకుల్లో ఉంచడానికి ఎవరూ ఇష్టపడటం లేదు, పైగా బ్యాంకులనుంచే అప్పులు తీసుకుని ఇల్లు, ఫ్లాట్, కారు, ఇతర విలాస వస్తువులు కొనేస్తున్నారు. వీటికోసం అత్యధికంగా రుణాలు తీసుకుంటున్నారు.

పొదుపు తగ్గింది, అప్పులు పెరిగాయి.. భారతీయుల తీరు మారింది
X

కరోనా తర్వాత భారతీయుల ఆలోచన విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పెట్టుబడులు, పొదుపు, విలాసాలు.. అనే వాటిలో మన ఆలోచనా ధోరణి పూర్తిగా మారింది. పొదుపు విషయంలో భారతీయులు మునుపటిలా లేరని అంటున్నారు ఆర్థికరంగ నిపుణలు. 2022-23లో కుటుంబాల పొదుపు 50 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయి జీడీపీలో 5.1 శాతానికి తగ్గింది. అంటే ఈ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పొదుపు తగ్గింది.. అప్పులు పెరిగాయి..

పొదుపు తగ్గించిన భారతీయ కుటుంబాలు, అప్పులు పెంచుకుంటున్నాయి. బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న వ్యక్తిగత రుణాలలో భారీ పెరుగుదల కనపడుతోంది. వ్యక్తిగత రుణాలను వస్తువుల కొనుగోళ్లకు ఉపయోగించుకుంటున్నారు, అదే సమయంలో స్థిరాస్తుల కొనుగోళ్లు కూడా పెరిగాయి. అంటే అప్పులను దుర్వినియోగం చేయట్లేదు కానీ ఆస్తులపై పెట్టుబడులకోసం ఉపయోగించుకుంటున్నారు. వ్యక్తిగత, విద్య, వాహన రుణాల్లో ఈ మార్పు స్పష్టంగా తెలుస్తోంది.

మార్పు స్పష్టం..

గతంలో పొదుపు అంటే బ్యాంకులో ఉన్న ఎఫ్.డి.లు, చేతిలో ఉన్న నగదు, బంగారం... ఇలా ఉండేది. ఇప్పుడు పొదుపు చేసిన డబ్బుల్ని బ్యాంకుల్లో ఉంచడానికి ఎవరూ ఇష్టపడటం లేదు, పైగా బ్యాంకులనుంచే అప్పులు తీసుకుని ఇల్లు, ఫ్లాట్, కారు, ఇతర విలాస వస్తువులు కొనేస్తున్నారు. వీటికోసం అత్యధికంగా బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా ఉదారంగా రుణాలు ఇచ్చేస్తున్నాయి. గతంలో ఆదాయాన్ని చూసి, ఇతర అప్పులను చూసి రుణాలు మంజూరు చేసేవారు. ఇప్పుడు అప్పులు ఇచ్చేవారు ఎక్కువయ్యారు కాబట్టి, అప్పుల పరిమితి కూడా పెరిగింది.

గణాంకాలతో స్పష్టం..

- దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 55 శాతం క్షీణించింది.

- కుటుంబాల రుణ భారం 2020-21 నుంచి రెండింతలు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరింది.

- కొవిడ్ కి ముందు పొదుపు వాటా జీడీపీలో 11.5 శాతం.. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో పొదుపు వాటా కేవలం 5.1 శాతం

- కొవిడ్ కి ముందు ఆస్తుల్లో పొదుపు 66 శాతం, ఇప్పుడు ఆస్తుల్లో పొదుపు కేవలం 48శాతం.

ఈ పరిణామాలు భారత్ లో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను మార్చే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సంక్షోభానికి అవకాశం లేదని ధీమాగా ఉంది.

First Published:  22 Sept 2023 10:49 AM IST
Next Story