Telugu Global
National

సెకనుకు 2.5 ఆర్డర్లు.. బిర్యానీకోసం భారతీయుల తహతహ

సెకనుకు 2.5 ఆర్డర్లు.. బిర్యానీకోసం భారతీయుల తహతహ
X

ఈ దశాబ్దంలో బిర్యానీని తలదన్నే వంటకం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే కాదు, మరికొన్నేళ్లపాటు బిర్యానీయే భారతీయుల ఫేవరెట్ ఫుడ్ అనుకోవాల్సిందే. ప్రస్తుతం బిర్యానీకోసం భారతీయులు తహతహలాడిపోతున్నారని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీల లెక్కలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది డిసెంబర్ లో స్విగ్గీ తమకు వచ్చిన ఆర్డర్ల గణాంకాలను విడుదల చేస్తుంది. వాటి ప్రకారం ఈ ఏడాది కూడా బిర్యానీయే టాప్ పొజిషన్లో ఉంది. ఈ ఏడాదే కాదు, గత 8ఏళ్లుగా భారతీయులు ఇష్టంగా తింటున్న వంటకం బిర్యానీయే. ఎనిమిదేళ్లుగా బిర్యానీ.. స్విగ్గీ టాప్ ఆర్డర్ గా నిలిచింది. ఈ ఏడాది సగటున సెకనుకు 2.5 బిర్యానీలను స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చారు భారతీయులు. కేవలం స్విగ్గీనే కాకుండా జొమాటో, ఇతర సేవలు కలుపుకుంటే ఈ లెక్క మరింత పెద్దదవుతుంది. రెస్టారెంట్లకు వెళ్లి తినే బిర్యానీలు కూడా కలుపుకుంటే భారతీయులు బిర్యానీ అంటే ఎంతగా లొట్టలేసుకుంటున్నారో అర్థమవుతుంది.

బెంగళూరు బాబులకు కేక్ లు..

దేశంలో బిర్యానీకోసం ఎక్కువ ఆర్డర్లు హైదరాబాద్ నుంచి వస్తే, బెంగళూరు వాసులు మాత్రం కేక్ ల కోసం తపించిపోతున్నారట. ఈ ఏడాది బెంగళూరు నుంచి అత్యథిక కేక్ ల ఆర్డర్లు వచ్చాయి. అవి కూడా ఎక్కువ చాక్లెట్ కేక్ లే స్విగ్గీలో డెలివరీ అయ్యాయి. ఏడాదికాలంలో బెంగళూరులో 85 లక్షల చాక్లెట్ కేక్ లను స్విగ్గీ డెలివరీ చేసింది.

వరల్డ్ కప్ ఫేవరెట్ పిజ్జా..

ఇక ఈ ఏడాది క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన రోజు భారత్ లో పిజ్జా డెలివరీలు ఎక్కువగా జరిగాయట. నవంబర్ 19న జరిగిన ఫైనల్ లో ఇండియా ఓడిపోయినా.. క్రికెట్ ప్రేమికులు మాత్రం పిజ్జాలు లాగించేశారు. నిమిషానికి 188 పిజ్జాల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ లెక్కలు చెబుతోంది.

శాకాహారుల ఫేవరెట్ మసాలా దోశ..

నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా బిర్యానీ లాగించేస్తే.. భారత్ లోని శాకాహారులు మసాలా దోశకోసం స్విగ్గీలో ఎక్కువగా ఆర్డర్లు పెట్టారు. దసరా సందర్భంగా నవరాత్రుల సమయంలో మసాలా దోశకు డిమాండ్ పెరిగింది. నవరాత్రుల సమయంలో రసగుల్లాలు, గులాబ్ జామూన్లు కూడా బాగానే లాగించారు భారతీయులు. 77.7 లక్షల రసగుల్లా ఆర్డర్లు స్విగ్గీకి వచ్చాయి. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఆన్ లైన్ ఫుడ్ కోసం ఏడాదిలో 42.3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం విశేషం. తనకు తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఆర్డర్లు పెట్టాడు ఆ మహానుభావుడు. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ లో కొందరు ఈ ఏడాదిలో 10వేలకంటే ఎక్కువ సార్లు స్విగ్గీ నుంచి ఫుడ్ తెప్పించుకున్నారు.

స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ లో కూడా ఈ ఏడాది బాగానే బిజినెస్ జరిగింది. ఇన్ స్టా మార్ట్ లో పాలు, పెరుగుకి డిమాండ్ ఎక్కువగా ఉందట. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి సింగిల్ ఆర్డర్ లో రూ.31,748 విలువైన వస్తువుల్ని ఇంటికి తెప్పించుకున్నాడు. జైపూర్ కి చెందిన మరో వ్యక్తి ఒకే రోజులో 67 సార్లు వస్తువుల్ని ఆన్ లైన్ ద్వారా తెప్పించుకోవడం మరో రికార్డ్.

First Published:  15 Dec 2023 12:10 PM IST
Next Story