Telugu Global
National

కరోనా టీకా.. భారత ప్రభుత్వ అసమర్థతకు ప్రతీక

కరోనా వ్యాక్సినేషన్‌లో అత్యంత దారుణంగా విఫలమైన దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచానికే టీకా అందించామని, ప్రపంచానికి టీకా సరఫరా చేసిన రెండు కంపెనీలు భారత్‌లోనే ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్నా.. టీకా సద్వినియోగంలో మాత్రం భారత్ ఘోరంగా విఫలమైంది.

కరోనా టీకా.. భారత ప్రభుత్వ అసమర్థతకు ప్రతీక
X

భారత్‌లో కరోనా టీకా పంపిణీ విషయంలో కేంద్రం పెద్ద ఘనత సాధించినట్టు చెప్పుకుంటోంది. ఏ పెట్రోల్ బంకులో చూసినా మోదీ ఫొటోలు, ఏ పబ్లిక్ ప్లేస్‌లో చూసినా మోదీ ఫొటోలతో వ్యాక్సిన్‌కి విపరీతమైన ప్రచారం కల్పించారు. కానీ ప్రచారం వేరు, వాస్తవం వేరు. కరోనా వ్యాక్సినేషన్‌లో అత్యంత దారుణంగా విఫలమైన దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచానికే టీకా అందించామని, ప్రపంచానికి టీకా సరఫరా చేసిన రెండు కంపెనీలు భారత్‌లోనే ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్నా.. టీకా సద్వినియోగంలో మాత్రం భారత్ ఘోరంగా విఫలమైంది.

ఆలస్యం.. అమృతం కాదు..

కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ చేసిన ఆలస్యం చాలా ప్రమాదకరమైనదని నిపుణుల అభిప్రాయం. 2021 జనవరి 16 నుంచి భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. కానీ అభివృద్ధి చెందిన దేశాలు అప్పటికే మందు చూపుతో ఆర్డర్లు ఇచ్చి ఉంచాయి. జనవరి 2021 నాటికి, భారత ప్రభుత్వం మొదటిసారిగా సీరమ్ ఇన్‌ స్టిట్యూట్ నుండి కోటి 10 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల కోవాగ్జిన్‌ డోసుల్ని కొనుగోలు చేసింది. ఫిబ్రవరి చివరిలో 2.1 కోట్లు, మార్చిలో 11కోట్ల డోసుల్ని కొనుగోలు చేసింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. తొలిదశ వ్యాక్సినేషన్ ని పూర్తి చేశాయి. అప్పటికీ భారత్ ఇంకా ఫస్ట్ డోస్ కోసం ఆర్డర్లు ఇవ్వడంతోటే సరిపెట్టింది. సెకండ్ వేవ్ విజృంభించే సమయానికి కేవలం 0.5 శాతం మంది భారతీయులకే టీకాలు అందాయి. ఆ తర్వాత ఆ సంఖ్య చాలా స్వల్పంగా పెరిగింది. ఇతర దేశాలకు టీకాల దానం పేరుతో సొంత పౌరులనే భారత్ విస్మరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి. 2020 చివరి నాటికే ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్.. ఇలా అన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం ఆర్డర్ ఇస్తే.. భారత్ మాత్రం నింపాదిగా ఉంది. అమెరికా తన జనాభాలో సగం మందికి పూర్తిగా టీకాలు వేసే సమయానికి భారత్‌లో ఒక వ్యక్తికి కూడా టీకా వేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మోదీకి ప్రచారం ఎందుకు..?

భారత్‌లో మారుమూల ప్రాంతాల్లో, రోడ్డు సౌకర్యం సైతం లేని గ్రామాలకు వెళ్లి టీకాలు వేయడానికి వైద్య సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. రోజుకి 20 కిలోమీటర్లు నడచి వెళ్లారు. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తుకి సైతం వెళ్లి టీకాలు పంపిణీ చేశారు. అలాంటి ఘనత సాధించినవారికి ప్రచారం చేయాలి కానీ మోదీ ఫొటోలతో ప్రచారం ఎందుకనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ కేంద్రం మాత్రం మోదీ ఫొటోలతోనే ప్రచారం చేసుకుంది. వైద్యులను, ఫ్రంట్ లైన్ వర్కర్లను బ్యాక్ లైన్లో నిలబెట్టింది.

ఆ రేట్లు వింటే మతిపోతుంది..

టీకా ఉచితంగా ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత, అది వారి విధి. అంతే కానీ, అది ప్రజలపై చూపించే దయ కాదు. మీజిల్స్, పోలియో.. ఇతర ఏ టీకా అయినా కేంద్రం ఉచితంగానే ఇచ్చింది, ఇస్తోంది కూడా. కొత్త టీకాలు వచ్చినా వాటిని కూడా ఉచితంగా ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ మోదీ ప్రభుత్వం కరోనా టీకాను ఉచితంగా ఇవ్వడం తమ గొప్పగా చెప్పుకుంటోంది. కానీ అది ప్రభుత్వం విధి అనేది ప్రజాస్వామ్యవాదుల మాట. వ్యాక్సిన్ తయారు చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసేందుకు ఒక్కో టీకాను రూ.150 చొప్పున అందుబాటులో ఉంచుతామని రెండు కంపెనీలు తెలిపాయి. రాష్ట్రాలకు 400 రూపాయలు, బహిరంగ మార్కెట్లో 600 రూపాయలుగా ధర ఉంటుందని చెప్పారు. కానీ ఆ తర్వాత రేట్లు భారీగా పెంచేశారు. భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్‌ను రాష్ట్రాలకు 600 రూపాయలకు అమ్మింది. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200గా రేటు నిర్థారించింది. ఒకే రకమైన వ్యాక్సిన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలకు ఎందుకు ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీంతో కోవిషీల్డ్ ధర తగ్గించారు. కానీ అదేదో దేశ సేవలా గొప్పలు చెప్పుకున్నారు.

ముంబైలోని టాటా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఆర్.రామ్ కుమార్ నివేదిక ప్రకారం భారతదేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తి ధర ఒక్కో డోసుకు రూ.30 నుంచి రూ.80 మధ్య ఉంటుంది. ఆ లెక్కన కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తూ ఒక్కో డోస్‌కు 188 శాతం నుంచి 500 శాతం వరకు లాభాలను ఆర్జించాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన టీకాల విషయంలో సీరం ఇన్‌ స్టిట్యూట్‌ కు ఒక్కో టీకాకు 750 శాతం నుంచి 2000 శాతం వరకు లాభాలు వచ్చాయి. భారత్ బయోటెక్ ప్రతి డోస్ కు 1500 శాతం నుంచి 4000 శాతం వరకు లాభాలను ఆర్జించింది. కోవిషీల్డ్ మన దేశంలో తయారవుతుందనే మాటే కానీ, విదేశాల కంటే భారత దేశమే ఈ టీకాను ఎక్కువ ధర చెల్లించి సేకరించింది. ఇక విదేశీ తయారీ టీకాల ధర కూడా తక్కువగానే ఉందని తెలుస్తోంది. భారత్‌లో మాత్రం కేవలం కంపెనీల లాభం కోసమే ప్రభుత్వం పనిచేసినట్టు అర్థమవుతోంది.

టీకాలే కాదు, వాటిని వేయడానికి ఉపయోగించే సిరంజ్‌ల సేకరణలోనూ భారత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని తెలుస్తోంది. సిరంజిలు లేకపోవడంతో చాలా చోట్ల టీకాల పంపిణీ ఆగిపోయిందట. కనీసం టీకాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, సిరంజ్‌ల ఆర్డర్లు కూడా ఇవ్వలేదని, తయారీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇక కొవిన్ యాప్‌లో టీకాల కోసం స్లాట్ బుక్ చేసుకోవడం అనేది మరో పెద్ద ప్రహసనం. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కానీ భారత్‌లో ఎంతమంది వద్ద స్మార్ట్ ఫోన్లు, ఉన్నాయి, ఎంతమంది తమకి తాముగా స్లాట్ బుక్ చేసుకుని టీకా కేంద్రాల వద్దకు వస్తారనేది ప్రభుత్వానికే తెలియాలి. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలతో టీకా కార్యక్రమాన్నే అపహాస్యం చేసింది కేంద్రం.

మొత్తమ్మీద టీకాల పంపిణీ, వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహణలో భారత్ దారుణంగా విఫలమైంది. కానీ ఆ తప్పుల్ని కప్పి పుచ్చుకోడానికి ఇప్పటికీ ప్రచారాన్నే నమ్ముకున్నారు నేతలు. ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఈలోగా ప్రైవేట్ ఆస్పత్రులు, టీకా తయారీ కంపెనీలు మాత్రం ప్రజల సొమ్ముని దోచుకున్నాయి. ఆ దోపిడీకి కేంద్రం పరోక్ష సహకారం అందించింది.

First Published:  17 Sept 2022 9:25 AM GMT
Next Story