ఇండియా ఇప్పుడు చంద్రుడిపై ఉంది.. చంద్రయాన్-3 విజయవంతం : ఇస్రో
సరిగ్గా సాయంత్రం 6.03 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ ఎలాంటి సమస్యలు లేకుండా చంద్రుడిపై అడుగు పెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
41 రోజుల ప్రయాణం.. చివరి ఉత్కంఠభరిత 19 నిమిషాలు.. ప్రపంచమంతా ఇండియా వైపే చూస్తుండగా.. 140 కోట్ల మంది భారతీయుల ఆశల్ని, కలల్ని నిజం చేస్తూ చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగింది. సరిగ్గా సాయంత్రం 6.03 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ ఎలాంటి సమస్యలు లేకుండా చంద్రుడిపై అడుగు పెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. 'ఇండియా ఇప్పుడు చంద్రుడిపై ఉంది' అంటూ ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ ప్రకటించారు. ఇస్రో సెంటర్‌లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారితో పాటు.. యావత్ దేశం చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
నాలుగేళ్ల క్రితం చెదిరిన కలను సాకారం చేసుకోవాలని ఇస్రో గత నెల 14న చంద్రయాన్-3ను ప్రయోగించింది. ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3ని విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 18 రోజుల వ్యవధిలో ఐదు దశల్లో కక్ష్యను పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా చంద్రకక్ష్యను తగ్గిస్తూ వచ్చారు.
ఆగస్టు 17న వ్యోమనౌక నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. ఇందులోనే ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఉన్నది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోయిన తర్వాత సొంతగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన ల్యాండర్‌కు రెండు సార్లు డీ-ఆర్బిట్ ప్రక్రియ చేపట్టింది. ఇక ఈ రోజు సాయంత్రం డిసెండింగ్ ప్రక్రియ చేపట్టారు. ఇస్రో అనుకున్న విధంగానే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా సాయంత్రం 6.03 గంటలకు జాబిల్లిపై దిగింది.
చంద్రుడిపై అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. అమెరికా, జపాన్, ఇజ్రాయేల్ దేశాలకు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు. రెండు రోజుల క్రితమే రష్యాకు చెందిన లూనా-25 దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టాలని ప్రయత్నించి విఫలమైంది. కానీ ఇస్రో మాత్రం అంతటి క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి నెట్టింది. ఇది ఇస్రో చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.