Telugu Global
National

బాధితుడిని భారత్ ఎందుకు పంపించారు..? మంకీపాక్స్ పై పోస్ట్ మార్టమ్..

విదేశాల నుంచి వచ్చేవారిని ఎయిర్ పోర్టుల్లోనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు అధికారులు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఈ నిబంధనలపై కసరత్తు చేస్తోంది.

బాధితుడిని భారత్ ఎందుకు పంపించారు..? మంకీపాక్స్ పై పోస్ట్ మార్టమ్..
X


కరోనా బాధితులు క్వారంటైన్లో ఉండాలి, ఇల్లు కదలకూడదనే నిబంధనలున్నాయి. మంకీపాక్స్ బాధితులు కూడా ప్రయాణాలు చేయకూడదు. అలాంటిది యూఏఈలో మంకీపాక్స్ సోకిన బాధితుడు దర్జాగా భారత్ ఎలా వచ్చాడు. యూఏఈ అధికారులు అతనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జులై 30న కేరళలో 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ తో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే అతడు చనిపోయే వరకు ఆ వైరస్ సోకినట్టు వైద్యులకు కూడా తెలియదు. చర్మంపై దద్దుర్ల వంటి లక్షణాలు లేకపోవడంతో ఎవరూ అనుమానించలేదు. తీరా చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు అసలు విషయం చెప్పారు. యూఏఈలో తీసుకున్న రిపోర్ట్ చూపించారు. దీంతో మరోసారి మృతుడి శరీరం నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించి వైరస్‌ను నిర్ధారించారు అధికారులు. భారత్‌లో అదే తొలి మంకీపాక్స్ మరణం. విచిత్రం ఏంటంటే.. భారత్ లో మంకీపాక్స్ తొలికేసు కూడా అదే.

సహజంగా మంకీపాక్స్ నిర్ధార‌ణ‌ అయిన తర్వాత వారిని క్వారంటైన్లో ఉంచాలి. కానీ యూఏఈ ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణానికి కూడా అనుమతిచ్చింది. అంటే అక్కడ ఎయిర్ పోర్టుల్లోనే దీన్ని లైట్ తీసుకున్నారు. దీంతో బాధితుడు భారత్ కి వచ్చి ఇక్కడ చనిపోయాడు. అతనితో సన్నిహితంగా ఉన్న 20 మందిని ఇప్పుడు కేరళలో క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని, విదేశాల నుంచి వచ్చేవారిని ఎయిర్ పోర్టుల్లోనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు అధికారులు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఈ నిబంధనలపై కసరత్తు చేస్తోంది.

మొత్తం ఏడుగురు..

కేరళలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనతోపాటు.. మొత్తంగా భారత్ లో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య ఏడుకి చేరింది. నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో నివశిస్తున్నాడు. అతడికి మంకీపాక్స్ సోకడంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విదేశీ ప్రయాణికులపై, విదేశీయులపై.. ఎయిర్ పోర్టుల్లో పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. పూర్తి స్థాయి లక్షణాలు లేకపోయినా అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ముఖ్యంగా యూఏఈ ఇచ్చిన షాక్ తో ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై కూడా భారత్ అధికారులు గట్టి నిఘా పెట్టారు.

First Published:  2 Aug 2022 2:48 PM IST
Next Story