Telugu Global
National

నేపాల్‌లో ఎన్నికలు.. భారత్ నుంచి చదివింపులు

ఇప్పటి వరకు 2400 వాహనాలను భారత్, నేపాల్‌కి అందించింది. అక్కడ ఎన్నికల కమిషన్ అవసరాలకు, ఇతర సంస్థల అవసరాలకు వాటిని వినియోగిస్తున్నారు. ఈసారి మరో 200 వాహనాలను భారత్, నేపాల్‌కి అందించింది.

నేపాల్‌లో ఎన్నికలు.. భారత్ నుంచి చదివింపులు
X

పొరుగుదేశం నేపాల్‌తో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తుంటుంది. అందులో భాగంగా ఆ దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఇక్కడి నుంచి వాహనాలను వారికి బహుమతిగా ఇస్తుంది. ఇది దశాబ్దాలుగా జరుగుతోంది. తాజాగా ఈ దఫా ఎన్నికల కోసం కూడా భారత్, నేపాల్‌కి 200 వాహనాలను అందించింది. నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ, నేపాల్ ఆర్థిక మంత్రి జనార్దన శర్మకు వాహనాలను అధికారికంగా అప్పగించారు.

ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ ఎంత ఖర్చు పెడుతుందో అందకు వంద రెట్లు అభ్యర్థులు ఖర్చు పెట్టడం భారత్‌లో ఆనవాయితీ. అయితే నేపాల్‌లో ఎన్నికల కమిష‌న్‌కి ఆ స్థాయిలో నిధుల కేటాయింపు లేదు. అందుకే ఎన్నికల నిర్వహణ కోసం ఇతర దేశాలపై వారు ఆధారపడుతుంటారు. ప్రతిసారి భారత్ తరపున వాహనాలు ఇవ్వడం ఆనవాయితీ. ఇలా ఇప్పటి వరకు 2400 వాహనాలను భారత్, నేపాల్‌కి అందించింది. అక్కడ ఎన్నికల కమిషన్ అవసరాలకు, ఇతర సంస్థల అవసరాలకు వాటిని వినియోగిస్తున్నారు. ఈసారి మరో 200 వాహనాలను భారత్, నేపాల్‌కి అందించింది.

200 వాహనాల్లో 120 వాహనాలను భద్రతా బలగాలు వినియోగించుకుంటాయి, మిగిలిన 80 వాహనాలను నేపాల్ ఎన్నికల సంఘం ఉపయోగిస్తుంది. భారతదేశం, నేపాల్ మధ్య ఉన్న సామరస్యపూర్వక సంబంధం కొనసాగేలా ఈ వాహనాల అప్పగింత సాయపడుతుందని అంటున్నారు అధికారులు.

First Published:  2 Nov 2022 5:51 AM GMT
Next Story