Telugu Global
National

పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమి కసరత్తు

ఏదైనా రాష్ట్రంలోని సీట్ల సర్దుబాటులో మిత్రుల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే.. ఆ రాష్ట్రంలో ఉనికిలో లేని భాగస్వామ్య పార్టీ.. రెండింటి మధ్య వారధిగా వ్యవహరించాలని నిర్ణయించారు.

పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమి కసరత్తు
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు, ఆయా రాష్ట్రాల్లో పొత్తులను పూర్తి చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ క్రమంలో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలనే విషయంపై దృష్టి సారించాయి. పొత్తులను ఖరారు చేయడానికి వివిధ రకాల పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఇండియా కూటమిలోని కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. ఎన్సీపీ, శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం) మహారాష్ట్రలో బలంగా ఉన్నది. అలాగే పంజాబ్ రాష్ట్రంలో ఆప్, కాంగ్రెస్ వంటి పార్టీలకు బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నది. దీంతో ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ఎలా చేయాలనే విషయంపై లోతుగా చర్చిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సూచనలు సమన్వయ కమిటీ ముందుకు వచ్చాయి. వాటిని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఏదైనా రాష్ట్రంలోని సీట్ల సర్దుబాటులో మిత్రుల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే.. ఆ రాష్ట్రంలో ఉనికిలో లేని భాగస్వామ్య పార్టీ.. రెండింటి మధ్య వారధిగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల్లో బలమైన పార్టీని గత ఎన్నికల ఫలితాల ఆధారంగా నిర్ణయించనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కలిపి ఆయా రాష్ట్రాల్లోని బలమైన పార్టీ ఏంటో డిసైడ్ చేస్తారు. దీనిపై తుది నిర్ణయం కోసం భాగస్వామ్య పక్షాల అంగీకారాన్ని కూడా తీసుకుంటారని తెలుస్తున్నది.

లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల అవగాహన కుదిరితే అది తప్పకుండా సార్వత్రిక ఎన్నికలకు మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇండియా కూటమి లోని కొన్ని పక్షాల మధ్య ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, తమిళనాడులో పొత్తులు కొనసాగుతున్నాయి. ఇవే పొత్తులు భవిష్యత్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉన్నది.

గత లోక్‌సభ ఎన్నికల్లో మిత్రులు గెలుచుకున్న సీట్లను తిరిగి వారికే కేటాయించాలని నిర్ణయించారు. అలా చేయడం వల్ల సిట్టింగ్ ఎంపీలకు తిరిగి టికెట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కేవలం ఎన్డీయే కూటమిలోని పార్టీలు గెలుచుకున్న సీట్లలో పొత్తులపై ఆలోచిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. కాగా, ఈ విషయంపై కూటమి నేతలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది.

First Published:  15 Sept 2023 6:21 AM IST
Next Story