ఉద్దవ్ ఠాక్రే బృందానికి సుప్రీంకోర్టులో ఊరట!
శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం ఉద్దవ్ ఠాక్రే, ఎక్ నాథ్ షిండే వర్గాల మధ్య సాగుతున్న పోరులో ఠాక్రే వర్గానికి కాస్త ఊరట లభించింది. తమదే శివసేన పార్టీగా గుర్తించాలని షిండే వర్గం దాఖలు చేసిన విజ్ఞప్తిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది.
మహారాష్ట్రలోఉద్దవ్ ఠాక్రే, ఎక్ నాథ్ షిండే వర్గాల మధ్య శివసేన పార్టీ గుర్తింపు కోసం జరుగుతున్న పోరు లో సుప్రీంకోర్టు గురువారంనాడు కీలక తీర్పునిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తమదే అసలైన శివసేనగా గుర్తించాలని పోరాడుతున్నవిషయం తెలిసిందే. తమదే శివసేన పార్టీగా గుర్తించాలని షిండే వర్గం దాఖలు చేసిన విజ్ఞప్తిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. అలాగే మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై దాఖలైన వివిధ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా వద్దా అనే విషయమై సోమవారంనాడు నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. తాజా పరిణామంతో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి స్వల్ప ఊరట లభించినట్లయింది.
దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో శివసేనపై తిరుగుబాటు చేసి బిజెపి ప్రాపకంతో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం తమదే అసలైన శివసేన అని, పార్టీ గుర్తు అయిన విల్లు, బాణం చిహ్నాన్ని తమ వర్గానికే కేటాయించాలంటూ షిండే వర్గం ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. అయితే తిరుగుబాటు నేపథ్యంలో ఎమ్మెల్యేలపై అనర్హత, పార్టీ ఇతర వ్యవహారాలకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అవి తేలే వరకూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఠాక్రే వర్గం ఈసీకి విన్నవించింది. ఇదే సందర్భంలో ..శివసేన పార్టీ గుర్తు విల్లు బాణం గుర్తు తమదేనని రుజువు చేసే పత్రాలతో పాటు లెజిస్లేచర్ పక్షం , పార్టీ సంస్థాగత సభ్యుల మద్దతు కూడిన లేఖలను ఆగస్టు 8వ తేదీలోగా తమకు అందించాలని ఎన్నికల సంఘం ఇటీవల ఠాక్రే, షిండే వర్గాలను ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఉద్దవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కనుక ఈసీ తదుపరి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని సుప్రీం కోర్టును కోరింది. షిండే వర్గం అక్రమంగా ఎమ్మెల్యేలను కూడగట్టి కృత్రిమ మెజారిటీని చూపించడానికి ప్రయత్నిస్తోందని ఠాక్రే వర్గం తన పిటిషన్ లో పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తేలేవరకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకూడదని కోర్టుకు వివరించింది. ఈ పిటిషన్ ను గురువారంనాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి షిండే వర్గం దాఖలు చేసిన వినతిపై ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది.
పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజస్వామ్యబద్దంగా మెజారిటీ సభ్యులు ఉన్న తమదే అసలైన శివసేన పార్టీ అని , మెజారిటీ సభ్యులు తీసుకున్న పార్టీ వ్యవహారాలో కోర్టులు జోక్యం చేసుకోజాలవని షిండే వర్గం వాదించింది. దీనిపై జస్టిస్ రమణ తీవ్రంగా స్పందిస్తూ కీలక ప్రశ్నలు సంధించారు. "మీరు ఎన్నికైన తర్వాత రాజకీయ పార్టీలను పూర్తిగా విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా" అని ప్రశ్నించారు.