అవార్డ్ వాపస్ చేసిన ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు గతంలో తనకు ఇచ్చిన బసవశ్రీ అవార్డును తిరిగి వెనక్కి ఇస్తున్నట్లు ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ ప్రకటించారు. ఇలాంటి నేరాలను ఖండించడానికి ఏ పదమూ సరిపోవడం లేదని ఆయన అన్నారు.
ప్రముఖ పాత్రికేయుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ 2017లో మురుగ మఠం తనకు అందించిన బసవశ్రీ అవార్డును తిరిగి వెనక్కి ఇస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటకలో పాఠశాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావును అరెస్టు చేయడంతో సాయినాథ్ శుక్రవారం వరుస ట్వీట్లలో తన నిర్ణయాన్ని ప్రకటించారు.
''లైంగిక వేధింపులకు గురైన బాలికలకు సంఘీభావంగా, ఈ కేసులో న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో, 2017లో మఠం నాకు అందించిన బసవశ్రీ అవార్డును, దానితో పాటు వచ్చిన రూ. 5 లక్షల ప్రైజ్ మనీని చెక్కు ద్వారా తిరిగి వెనక్కి ఇస్తున్నాను '' అని సాయినాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బాలికలపై మఠాధిపతి శరణారావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మీడియా కథనాల ద్వారా తెలుసుకుని కలవరపడ్డానని ఆయన అన్నారు.పిల్లలపై జరిగే ఇలాంటి నేరాలను ఖండించడానికి ఏ పదమూ సరిపోవడం లేదని సాయినాథ్ అన్నారు.
మైసూర్‌కు చెందిన ఎన్‌జిఓ 'ఓడానాడి' , ఈ సంఘటనలను వెలుగులోకి తీసుకురావడానికి చేసిన కృషి , సామాజిక దురాచారాలపై దశాబ్దాలుగా వారు చేస్తున్న పోరాటాన్ని కూడా ఆయన అభినందించారు.
ఈ లైంగిక వేధింపుల కేసు దర్యాప్తును పటిష్టంగా కొనసాగించాలని కర్ణాటక ప్రభుత్వానికి సాయినాథ్ విజ్ఞప్తి చేశారు.