బీజేపీ రాజస్థాన్ లో రాముణ్ణి పక్కన పెట్టి గ్రామదేవతల మీద దృష్టిపెట్టింది
త్వరలో రాజస్థాన్ లో జరగనున్న ఎన్నికల కోసం ఈ మధ్య బీజేపీ జైశ్రీరాం నినాదాన్ని వాడటం లేదు. స్థానిక గ్రామ దేవతలు, జానపద దేవతలపై తన దృష్టి కేంద్రీకరించింది.
రాజకీయ పార్టీలు తమ ఓట్ల అవసరానికి తగ్గట్టు ఎటువంటి నినాదాన్నైనా ఎత్తుకుంటాయి. అయితే బీజేపీ మాత్రం హిందుత్వ నినాదం తప్ప మరో నినాదమివ్వదని అందరం అనుకుంటాం. కానీ నిజానికి మిగతా పార్టీలకు బీజేపీకి ఓట్ల విషయంలో పెద్దగా తేడా ఏం లేదు. అది ఓట్ల కోసమే హిందుత్వను నెత్తికెత్తుకుంటుంది. ఓట్ల కోసం కావాలంటే దాన్ని పక్కన కూడా పెట్టగలదు.
త్వరలో రాజస్థాన్ లో జరగనున్న ఎన్నికల కోసం ఈ మధ్య బీజేపీ జైశ్రీరాం నినాదాన్ని వాడటం లేదు. స్థానిక గ్రామ దేవతలు, జానపద దేవతలపై తన దృష్టి కేంద్రీకరించింది.
గత కొన్ని నెలల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజస్థాన్‌లో మూడు సార్లు పర్యటించారు. ఆ మూడు పర్యటనలను పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్దమవుతుంది.
మోడీ ఇటీవలి భిల్వారా జిల్లాలోని మలసెరిలో పర్యటించారు. అక్కడ గుజ్జర్ల ప్రభావం ఎక్కువ. గుజ్జర్ల దేవుడు భగవాన్ దేవ్‌నారాయణ్‌జీ గురించే మోడీ ఎక్కువగా తన ప్రసంగంలో ప్రస్తావించాడు. ''1111వ సంవత్సరంలోనే భగవాన్ దేవ్‌నారాయణ్ జీ కమలం పూవులో కూర్చొని ఉన్నాడు. బీజేపీ గుర్తు కూడా కమలమే , అంతే కాదు ఈ సారి G20 అధ్యక్ష పదవి చేపట్టిన భారతదేశం తన లోగోలో కమలం చిహ్నాన్ని కలిగి ఉంది.ఇది యాదృచ్చికమా” అని ఆశ్చర్యపోవడం ద్వారా గుజ్జర్ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేశాదు మోడీ.
రాజస్థాన్ శాసనసభలో 8 మంది గుజ్జర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక్కరు కూడా బీజేపీకి చెందినవారు లేరు. అటువంటి పరిస్థితిలో, మోడీ గుజ్జర్లను బిజెపికి దగ్గర చేయడానికి పార్టీ ఎన్నికల గుర్తు, భగవాన్ దేవ్‌నారాయణ్ కమలం ఒకటే అని చెప్పడానికి ప్రయత్నించారు. దేవ్‌నారాయణ్ తామరపువ్వుపై పుట్టారని, మనం కూడా కమలంతో పుట్టామని ప్రధాని సమావేశంలో అన్నారు. మీతో మాకు లోతైన అనుబంధం ఉంది అన్నారాయన.
తన మంగఢ్ పర్యటనలో కూడా, ప్రధాని మోడీ గోవింద్ గిరి, ఇతర గిరిజన యోధుల గురించి మాట్లాడారు. వారికి చరిత్రలో ఇప్పటివరకు సరైన గౌరవం లభించలేదని అన్నారు. కానీ ఇప్పుడు ఆ మహానుభావుల గురించికి ప్రపంచానికి తెలియాల్సిన సమయం వచ్చిందన్నారు.
అదేవిధంగా, మలసెరిలో తన ప్రసంగంలో, విజయ్ సింగ్ పాథిక్, రాంప్యారీ గుర్జార్, పన్నాధైతో సహా ఇతర గుజ్జర్ వ్యక్తుల పేర్లను ప్రస్తావించారు. ఈ దేశానికి, సంస్కృతికి వారి సహకారం చాలా గొప్పదని మోడీ మాట్లాడారు. ఇలాంటి అసంఖ్యాక యోధులు చరిత్రలో పొందాల్సిన స్థానాన్ని పొందలేకపోయారని అన్నారు. ఇప్పుడు వారందరి గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు.
అదేవిధంగా, మలసేరిలో తన ప్రసంగంలో రామ్‌దేవ్‌జీ, తేజాజీ, గోగాజీ, పాబూజీతో సహా అనేక మంది జానపద (గ్రామ) దేవతలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఆ దేవుళ్ళ గొప్పదనం ప్రపంచానికి చాటాలన్నారు మోడీ.
గతేడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా రామ్‌దేవ్రా నుంచి 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రానున్న కాలంలో జానపద దేవతలు, వాటికి సంబంధించిన ప్రదేశాలపై మరిన్ని కార్యక్రమాలు బీజేపీ నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అంతకుముందు, మాన్‌గర్ వెళ్ళిన ప్రధానమంత్రి గిరిజనుల మధ్య ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఆయన గోవింద్ గిరి త్యాగం, గిరిజనుల సంస్కృతి గురించి మాట్లాడారు.
రాజస్థాన్‌లో గిరిజనుల ప్రాబల్యం ఉన్న స్థానాలను పరిశీలిస్తే, 25 అసెంబ్లీ స్థానాలు ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు. ఇవి కాకుండా, గిరిజన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న మరో 10 స్థానాలు ఉన్నాయి. వీటిలో ఉదయపూర్, రాజ్‌సమంద్, చిత్తోర్‌గఢ్, భిల్వారా, బరన్, సిరోహి స్థానాలు ఉన్నాయి.
గిరిజనులు కూడా సాంప్రదాయకంగా కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గిరిజనులతో బలంగా మమేకమయ్యే దిశలో మంగర్ లో ప్రధాని కార్యక్రమం సాగింది.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ గుజ్జర్ వర్గానికి చెందిన వాడు. అందువల్ల రాజస్థాన్ లో గుజ్జర్ వర్గం పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మలసెరి కార్యక్రమం నిర్వహించారు. రాజస్థాన్‌లోని 15 స్థానాల్లో గుజ్జర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు.
భిల్వారాలోని మలసేరి డంగ్రీ ప్రాంతాల్లో గత 4 నెలల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించడం ఇది మూడోసారి.
అంతకుముందు అబూ రోడ్‌లోని మన్‌పూర్, బన్స్వారాలోని మాన్‌గఢ్ ధామ్‌లో మోడీ పర్యటించారు. ఇది ప్రధానమంత్రి అధికారిక పర్యటన. అయినప్పటికీ ఈ పర్యటనలో బీజేపీ, ప్రధాని కార్యాలయం వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ను పూర్తిగా దూరంగా ఉంచాయి.
గుజ్జర్ సొసైటీలో బిజెపి పట్టును బలోపేతం చేయడానికి, ఈ కార్యక్రమం నిర్వహించారు.
అధికారిక కార్యక్రమం అయినప్పటికీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ఆహ్వానించకపోవడానికి ఇదే కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాజస్థాన్‌లో గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన అత్యున్నత నాయకుడిగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను కూడా ఆహ్వానించలేదు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగానీ, గుజ్జర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగానీ ఎవరూ కనిపించలేదు. దేవ్‌నారాయణ్ బోర్డు అధ్యక్షుడు జోగిందర్ అవానా కూడా రాలేదు.
మొత్తానికి ఈ మధ్య కాలంలో మోడీ రాజస్థాన్ పర్యటనలో ఎక్కడా జై శ్రీరాం నినాదం వినపడలేదు. స్థానిక గ్రామ, జానపద దేవతలకే జైకొట్టింది బీజేపీ. రాజస్థాన్ లో గెలవాలంటే ప్రధానంగా గుజ్జర్లు, గిరిజనులను తమవైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ప్రణాళిక. అందుకే ఆయా వర్గాల స్థానిక దేవతలపైనే కేంద్రీకరించింది బీజేపీ. ఆయావర్గాల సమస్యలగురించి కాకుండా దేవతల గురించి మాట్లాడితేనే ఓట్లు రాలుతాయని బీజేపీ భావిస్తున్నట్లుంది.