Telugu Global
National

భారత్ లో 42శాతం మంది ప్రజలు సైబర్ క్రైమ్ బాధితులే..

ఆన్ లైన్ చెల్లింపులు పెరిగే కొద్దీ, ఆన్ లైన్ క్రైమ్ కూడా పెరుగుతోంది. ఫలితంగా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సైబర్‌ మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.

భారత్ లో 42శాతం మంది ప్రజలు సైబర్ క్రైమ్ బాధితులే..
X

గతంలో ఒక బ్యాంక్ అకౌంట్, ఒక డెబిట్ కార్డ్, మహా అయితే ఒక బ్యాంక్ కి సంబంధించిన ఆన్ లైన్ అకౌంట్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్.. ఇలా వ్యవహారం ఉండేది. ఇప్పుడు సగటున మూడు నాలుగు బ్యాంక్ అకౌంట్లు, వాటి ఏటీఎం పిన్ నెంబర్లు, క్రెడిట్ కార్డ్ ల పిన్ నెంబర్లు, ఆన్ లైన్ అకౌంట్ల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు, మొబైల్ యాప్ కి సెపరేట్ గా పిన్ నెంబర్లు.. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలంటే ఎలా..? కచ్చితంగా పేపర్ పై పెట్టాల్సిందే. ఇంట్లో పుస్తకంలో రాసి పెడితే అవసరమైనప్పుడు ఉపయోగపడేది ఎలా..? అలా అయితే మొబైల్ లో సేవ్ చేసుకోవాలి, లేదా ఈ మెయిల్ లో అప్డేట్ చేసుకోవాలి. సరిగ్గా ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తున్నారు. ఇలా మొబైల్ లో, మెయిల్స్ లో సేవ్ చేసుకున్న సమాచారం ఈజీగా బయటకెళ్లిపోతోంది. ఫలితంగా బ్యాంకులో డబ్బులు మనకు తెలియకుండానే ఖాళీ అవుతున్నాయి.

ఆన్ లైన్ చెల్లింపులు పెరిగే కొద్దీ, ఆన్ లైన్ క్రైమ్ కూడా పెరుగుతోంది. ఫలితంగా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సైబర్‌ మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో తాము కానీ, తమ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఎవరో ఒకరు ఆన్ లైన్ మోసానికి బాధితులు అయినట్టు 42శాతం మంది ప్రజలు చెప్పారు. చిన్నదో, పెద్దదో.. ఎంతోకొంత మొత్తం ఆన్ లైన్ మోసాల వల్ల కోల్పోయినట్టు చెబుతున్నారు. అయితే పెద్ద మొత్తాలు పోయినప్పుడే ఈ వ్యవహారాలు పోలీస్ కేసుల వరకూ వెళ్తున్నాయి. లేకపోతే బాధితులు మౌనంగా రోదిస్తున్నారు తప్పితే, పక్కవారికి కూడా తాము మోసపోయినట్టు చెప్పుకోవడంలేదు. ఇలా పదీ, ఇరవై, వంద, వెయ్యి.. బాధితుల సొమ్ము అంతా కలిపితే.. కోట్లలోనే స్వాహా అయిపోతోంది.

ఎందుకిలా..?

డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెబుతున్నవారు దాన్ని మళ్లీ అప్డేట్ చేసుకోవడంలేదు. ఇలాంటి వారు 29శాతం మంది ఉన్నారు.

ఆఫీస్ లో కొలీగ్స్ కి కూడా హాయిగా క్రెడిట్ కార్డ్ ల పిన్ నెంబర్ చెప్పేస్తున్నారు. ఇలాంటివారు 4 శాతం మంది ఉన్నారు.

బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు నంబర్లు, పాస్‌ వర్డ్‌ లు ఈమెయిల్ లో సేవ్‌ చేస్తున్నవారు 33 శాతం మంది.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పాస్‌ వర్డ్‌లు, పిన్ నెంబర్లు మొబైల్‌ ఫోన్‌ కాంటాక్ట్‌ నంబర్లలో సేవ్‌ చేస్తున్న వారు 11 శాతం మంది ఉన్నారు. వీరంతా ఏదో ఒక సమయంలో బాధితులుగా మారుతున్నారు.

అంతా స్వయంకృతాపరాధాలే..

సైబర్ మోసానికి బలయ్యారంటే, కచ్చితంగా దానికి ఆయా వ్యక్తులు చేసిన తప్పే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ఏదో ఒక సందర్భంలో మనకై మనం చేసిన తప్పులే మన డబ్బులు పోవడానికి కారణం అంటున్నారు. టెక్నాలజీని వాడుకోవడంతోపాటు, టెక్నాలజీ వల్ల కలిగే నష్టాలని కూడా అంచనావేయాలి, అవగాహన కలిగి ఉండాలంటున్నారు. భారత్ లో సగటున పదిమందిలో నలుగురు సైబర్ మోసాలకు గురయ్యే అవకాశముందని లోకల్ సర్కిల్స్ సంస్థ చెబుతోంది. దేశవ్యాప్తంగా ప్రతినెలా 80వేల సైబర్‌ ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. సుమారు 200కోట్ల రూపాయల మేర ప్రతి ఏడాదీ సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు.

రికవరీ అంతంతమాత్రమే..

దొంగతనం జరిగిందంటే.. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దొంగ ఎక్కడికీ తప్పించుకు పోలేడు. కానీ సైబర్ మోసం జరిగిందంటే.. దాన్ని కనిపెట్టడం, మూలాలను వెతికిపట్టడం, వారిని అరెస్ట్ చేయడం.. కష్టమైన పని. అందుకే ఇలాంటి మోసాల్లో రికవరీలు కూడా తక్కువ. సైబర్‌ క్రైం పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలన్నీ కలిపి గత మూడేళ్లలో 17శాతం కేసుల్లో మాత్రమే బాధితుల సొమ్ము రికవరీ చేయగలిగారు. ఆన్‌ లైన్‌ లావాదేవీల్లో తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతోపాటు.. బాధితులు చేసే చిన్న చిన్న తప్పులే.. వారికై వారు మోసగాళ్ల చేతికి చిక్కేలా చేస్తున్నాయని లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ హెచ్చరిస్తోంది.

First Published:  16 Aug 2022 11:56 AM IST
Next Story