Telugu Global
National

అతిక్ అహ్మద్ హత్యపై అనేక అనుమానాలు...ఈ ప్రశ్నలకు UP పోలీసుల వద్ద సమాధానం ఉందా ?

పోలీసులు అసాధారణ సమయంలో అతీక్, అష్రఫ్‌లను ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు? ఒక వేళ ఆస్పత్రికి వెళ్ళాలని అతీక్, అష్రఫ్ లే అభ్యర్థించినట్లయితే, వారిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విషయం వారిని చంపిన దుండగులకు ఎలా తెలిసింది ? అలాగే, అతిక్, అష్రఫ్ ఇద్దరూ ఒకే సమయంలో తమ ఆరోగ్య బాగాలేదని చెప్పారా ? వారు తమకు అనారోగ్యంగా ఉందని ఫిర్యాదు చేస్తే, అంబులెన్స్‌లో తీసుకెళ్లకుండా కాలినడకన ఒక ఊరేగింపులాగా ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్ళారు?

అతిక్ అహ్మద్ హత్యపై అనేక అనుమానాలు...ఈ ప్రశ్నలకు UP పోలీసుల వద్ద  సమాధానం ఉందా ?
X

గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ఏప్రిల్ 15న రాత్రి సాధారణ వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని స్థానిక కొల్విన్ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా, వారిని ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. రెండు రోజుల క్రితం అతిక్ కుమారుడు అసద్, అతని సహచరుడిని పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. అది ఎన్ కౌంటరా కాదా అనే విషయం తేలాల్సి ఉంది.

ఇక నిన్న జరిగిన అతిక్ అహ్మద్, అష్రఫ్ ల‌ హత్య అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోంది.

వారిని అంత రాత్రి ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్ళారు ?

ఏప్రిల్ 13న, ప్రయాగ్‌రాజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్‌లను ఏప్రిల్ 17 వరకు పోలీసు కస్టడీకి పంపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 54లో నిర్దేశించిన విధానం ప్రకారం, ఒక వ్యక్తి పట్టుబడిన వెంటనే అతనికి వైద్య పరీక్ష నిర్వహించడం తప్పనిసరి. అయితే ఇక్కడ పోలీసులు ఆ విచక్షణే పాటించ లేదు.

పోలీసులు, అరెస్టయిన వ్యక్తిని కోర్టులో హాజరుపరచడానికి ముందు మాత్రమే వైద్య తనిఖీ కోసం తీసుకెళ్తారు. ప్రముఖ వెబ్ పోర్టల్ తో మాట్లాడిన‌ పలువురు సీనియర్ పోలీసు అధికారులు , వైద్య పరీక్షలు తప్పనిసరి అయితే, నిందితులను రాత్రిపూట సాధారణ తనిఖీ కోసం తీసుకెళ్లడం అసాధారణమని అన్నారు. "పోలీసులు నిందితులను అర్థరాత్రి సాధారణ తనిఖీకి తీసుకెళ్లడం చాలా విచిత్రంగా ఉంది" అని ఒక సీనియర్ IPS అధికారి అన్నారు.

UP పోలీసులు తప్పక సమాధానం ఇవ్వాల్సిన కొన్ని ప్రశ్నలు:

పోలీసులు అసాధారణ సమయంలో అతీక్, అష్రఫ్‌లను ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు? ఒక వేళ ఆస్పత్రికి వెళ్ళాలని అతీక్, అష్రఫ్ లే అభ్యర్థించినట్లయితే, వారిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విషయం వారిని చంపిన దుండగులకు ఎలా తెలిసింది ? అలాగే, అతిక్, అష్రఫ్ ఇద్దరూ ఒకే సమయంలో తమ ఆరోగ్య బాగాలేదని చెప్పారా ? వారు తమకు అనారోగ్యంగా ఉందని ఫిర్యాదు చేస్తే, అంబులెన్స్‌లో తీసుకెళ్లకుండా కాలినడకన ఒక ఊరేగింపులాగా ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్ళారు?

వారి తరపు న్యాయవాది విజయ్ మిశ్రా మాట్లాడుతూ, ఇద్దరినీ రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారని, వారు ఎటువంటి అనారోగ్యం గురించి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఆసుపత్రికి వారిని తీసుకెళ్ళిన సమయం అత్యంత సందేహాస్పదంగా ఉంది అని ఆయన అన్నారు.

నిందితులిద్దరికి ఎందుకు సంకెళ్లు వేశారు?

అతిక్, అష్రఫ్ లను ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో వారిద్దరికి కలిపి సంకెళ్ళు వేశారు. 1978 నాటికే, సునీల్ బాత్రా vs ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అద‌ర్స్ కేసులో, ని‍ందితులకు సంకెళ్ళు వేయడాన్ని సుప్రీం కోర్ట్ వ్యతిరేకించింది. అలా సంకెళ్ళతో బంధించడం మనుషులను కించపరచడం, అవమానించడంగా కోర్టు పేర్కొంది.

ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అనే మరో కేసులో కూడా అత్యున్నత న్యాయస్థానం ఇలాగే చెప్పింది: “చేతులు లేదా కాళ్లు లేదా రెండింటినీ సంకెళ్ళతో బంధించడం శిక్షార్హమైనది.” అని పేర్కొంది.

అతిక్, అష్రఫ్‌ ఇద్దరికి కలిపి సంకెళ్ళు వేసి, వారికి వేరు వేరుగా కదలకలు లేకుండా చేశారు. దుండగులు అతిక్ ను కాల్చినప్పుడు అష్రఫ్‌ తప్పించుకునే అవకాశం లేకుండా సంకెళ్ళు అడ్డుకున్నాయి.

ప్రాణహాని ఉన్నా సరైన భద్రత లేదు

అత్యంత సంచలనం సృష్టించిన హత్య కేసులో అతిక్, అష్రఫ్‌లు నిందితులుగా ఉన్నారు. రెండు రోజుల క్రితమే అతిక్ కొడుకు హత్యకు గురయ్యాడు. అతిక్, అష్రఫ్ ఇద్దరూ తమ ప్రాణాలకు ముప్పు ఉందని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. నిజానికి, ఏప్రిల్ 11న, అతిక్‌ని గుజరాత్‌లోని సబర్మతి జైలు నుండి ప్రయాగ్‌రాజ్‌కు తరలించినప్పుడు, అతను మార్గమధ్యలో తనను చంపుతారనే భయాన్ని వ్యక్తం చేశాడు. “నన్నిలా తరలించడం సరికాదు. నన్ను చంపాలని చూస్తున్నారు’’ అని జైలు బయట గుమికూడి ఉన్న జర్నలిస్టులతో అతిక్ చెప్పాడు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ కోసం అతిక్, అష్రఫ్ లు ప్రయాగ్‌రాజ్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రత్యేక దరఖాస్తును సమర్పించారు. ఈ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.

తన ప్రాణాలకు కచ్చితంగా ముప్పు ఉన్న వ్యక్తి, తనను చంపుతారని అనేక సార్లు చెప్పిన‌ వ్యక్తిని కాలినడకన ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు? ఈ ఆసుపత్రి సందర్శన సమయంలో, జర్నలిస్టులను వారిద్దరికి అంత దగ్గరగా ఎందుకు అనుమతించారు? పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే , దుండగులు జర్నలిస్టులుగా మారువేషంలో వచ్చి ఇరువురిని హత్య చేశారనడాన్ని ఖండించగలమా ?.

First Published:  16 April 2023 10:14 AM GMT
Next Story