Telugu Global
National

మాంసాహారం మానండి - మంచి మనుషులుగా మారండి..!

ప్రజల మాంసాహారపు అలవాట్లు, జీవహింస వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని విద్యార్థులతో ఐఐటీ-మండీ డైరెక్టర్ చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మాంసాహారం మానండి - మంచి మనుషులుగా మారండి..!
X

ఫలానా ఆకులు తింటే వందేళ్లు బతుకుతారు..

ఫలానా కాయలు తింటే షుగర్ మటాష్, బీపీ పరార్..

రోగాలు రాకుండా ఉండాలంటే చికెన్, మటన్ మానేయండి..

యూట్యూబ్ వ్యూస్ కోసం వీడియోలకు చాలామంది ఇలాంటి థంబ్ నెయిల్స్ వాడుతుంటారు. సోషల్ మీడియా డాక్టర్లుగా చలామణిలో ఉంటారు. అయితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారెవరూ ఇలాంటి సెల్ఫ్ మేడ్ స్టేట్ మెంట్ లు ఇవ్వరు. కానీ బీజేపీ హయాంలో ఈ వైపరీత్యాలన్నీ సాధారణంగా మారిపోయాయి. ప్రతిష్టాత్మక ఐఐటీ డైరెక్టరే ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చికెన్, మటన్ మానేయాలంటూ ఐఐటీ-మండీ డైరెక్టర్ లక్ష్మీధర్ బెహరా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఎందుకంటే..?

యూరిక్ యాసిడ్ సమస్యలున్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలంటూ డాక్టర్లు సలహా ఇవ్వడం సహజం. అయితే ఇక్కడ మాంసాహారానికి ప్రకృతి విపత్తులకు ముడిపెట్టారు ఐఐటీ-మండీ డైరెక్టర్ లక్ష్మీధర్ బెహరా. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన విపత్తులను, హిమపాతాన్ని నాన్ వెజ్ కి ముడిపెడుతూ సరికొత్త వాదన తెరపైకి తెచ్చారాయన.

ప్రజల మాంసాహారపు అలవాట్లు, జీవహింస వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని విద్యార్థులతో ఐఐటీ-మండీ డైరెక్టర్ చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కడితో ఆగలేదు, మాంసాహారాన్ని తినబోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ కూడా చేయించారాయన. అమాయకమైన జంతువులను వధిస్తున్నామని, పరస్పర ఆధారిత సహజీవి సంబంధం వల్ల ఇది పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోందని, దీనివల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయని అన్నారు బెహరా. ఫైనల్ గా ప్రకృతి విపత్తులకు ప్రధాన కారణం మనుషులు మాంసాహారం తినడమేనని తేల్చారు. ఒక ఐఐటీ డైరెక్టర్ ఈ తలతిక్క సంబంధం చెప్పడమేంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ శాకాహార డైలాగులకు బీజేపీ ప్రభుత్వమే కారణం అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

First Published:  8 Sept 2023 8:03 AM IST
Next Story