ఐఎఫ్‌ఎస్ అధికారి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. - ఈడీ సోదాల్లో బట్టబయలు
కాంగ్రెస్ నేత హరక్ సింగ్‌తో పాటు రాష్ట్రంలోని 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేసినట్లు ఈడీ వెల్లడించింది. సోదాల విషయం తెలిసిన వెంటనే ఐఎఫ్‌ఎస్ ఉన్నతాధికారులు సుశాంత్ పట్నాయక్‌పై చర్యలు చేపట్టారు.
మనీ ల్యాండరింగ్‌కి పాల్పడ్డారనే ఆరోపణలపై ఓ ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్) అధికారి నివాసంలో తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులకు విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. ఆ ఇంట్లో భారీ మొత్తంలో నగదు, ఆస్తి పత్రాలతో పాటు డబ్బు లెక్కించే యంత్రాలు కూడా ఉండటం అధికారులను విస్తుపోయేలా చేసింది. ఇంతకీ ఆ అధికారి ఎవరో కాదు హరిద్వార్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ పట్నాయక్. ఆయన అటవీ భూముల కుంభకోణంలో నిందితుడు.
పక్కా సమాచారంతో బుధవారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం తెల్లవారుజాము వరకు ఈ సోదాలు కొనసాగించారు. ఈ సోదాల్లో రూ.4.5 కోట్ల నగదుతో పాటు రూ.34 కోట్ల విలువైన నగలు, పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. ఎన్వలప్ కవర్లలో కొంత నగదు ఉంచి, వాటిపై కొందరు ఐఎఫ్‌ఎస్, రేంజర్ స్థాయి అధికారుల పేర్లను రాసినట్లు ఈడీ గుర్తించింది. వారిని కూడా త్వరలో విచారణ చేస్తామని తెలిపింది.
కాంగ్రెస్ నేత హరక్ సింగ్‌తో పాటు రాష్ట్రంలోని 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేసినట్లు ఈడీ వెల్లడించింది. సోదాల విషయం తెలిసిన వెంటనే ఐఎఫ్‌ఎస్ ఉన్నతాధికారులు సుశాంత్ పట్నాయక్‌పై చర్యలు చేపట్టారు. తక్షణమే ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మాజీ డివిజినల్ ఫారెస్ట్ అధికారి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన ఇంట్లోనూ సోదాలు జరిగాయి.