Telugu Global
National

'కాశ్మీర్‌ ఫైల్స్' ఓ వల్గర్ మూవీ.. IFFI జ్యూరీ చీఫ్ వ్యాఖ్యలు

ఈ ఫెస్టివల్ లో మొత్తం 15 అంతర్జాతీయ సినిమాలు చూశామని అందులో 14 చాలా క్వాలిటీ ఉన్న సినిమాలని లపిడ్ అన్నారు. 15వ సినిమా అయిన 'ది కాశ్మీర్ ఫైల్స్' మాత్రం ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించగలిగిన మూవీ కాదన్నారు.

కాశ్మీర్‌ ఫైల్స్ ఓ వల్గర్ మూవీ.. IFFI జ్యూరీ చీఫ్ వ్యాఖ్యలు
X

కాశ్మీర్‌ ఫైల్స్ మూవీ రిలీజైన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ మూవీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ అబద్దాలతో, విద్వేషాలు రెచ్చగొట్టడానికి తీసిన మూవీగా కొందరు వ్యాఖ్యలు చేయగా ఒక వర్గానికి జరిగిన అన్యాయాన్ని చూపించిన మూవీగా మరి కొందరు ప్రశంసలు గుప్పించారు. ఏదేమైనా మూవీ ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

1990 ప్రాతంలో కాశ్మీర్‌ లో కాశ్మీరీ పండితులపై జరిగిన దురాగతాలపై ఒక వర్షన్ ను తెరకెక్కించిన ఈ మూవీ పట్ల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జ్యూరీ చీఫ్ నడవ్ లపిడ్ తీవ్ర విమర్శలు చేశారు.

ఈ ఫెస్టివల్ లో మొత్తం 15 అంతర్జాతీయ సినిమాలు చూశామని అందులో 14 చాలా క్వాలిటీ ఉన్న సినిమాలని లపిడ్ అన్నారు. 15వ సినిమా అయిన 'ది కాశ్మీర్ ఫైల్స్' మాత్రం ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించగలిగిన మూవీ కాదన్నారు.

''ఈ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 చాలా బావున్నాయి. కానీ 15వ సినిమా అయినా కాశ్మీర్‌ఫైల్స్ మాకు నచ్చలేదు. ఆ సినిమాని చూసి అందరం చాలా డిస్టర్బ్ అయ్యాం. దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది కళాత్మక పోటీకి తగని అసభ్య చిత్రంగా మాకు అనిపించింది. ఇటువంటి ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో ఇలాంటి వల్గర్ చిత్రాన్ని ఎందుకు ప్రదర్శించారో అర్థం కాలేదు. ఇక్కడ ఆత్మ విమర్శను సహృదయంతో అర్థం చేసుకోగలరు కాబట్టి ఇంత బహిరంగంగా అందరి ముందు మాట్లాడుతున్నా'' అని లపిడ్ అన్నారు.

నడవ్ లపిడ్ ఇజ్రాయిల్ కు చెందిన ప్రముఖ రచయిత, దర్శకుడు. కాశ్మీర్‌ ఫైల్స్ మూవీపై ఇతను చేసిన వ్యాఖ్య‌లపై ఆ సినీ దర్శకుడు, ఆ సినిమాలో నటించిన నటుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

''నిజాలు చాలా ప్రమాదకరమైనవి, అవి మనుషుల చేత అబ‌ద్ధాలు చెప్పిస్తాయి'' అని కాశ్మీర్‌ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ట్వీట్ చేశారు.

''దారుణమైన అణిచివేతకు గురైన యూదుల నుండి వచ్చిన లపిడ్ కాశ్మీరీ పండితుల బాధలు అర్థం చేసుకోకపోవడం సిగ్గు చేటు. నాడు యూదులపై జరిగిన నరమేధం నిజమైతే కాశ్మీరీ పండితులపై ఊచకోత కూడా నిజమే. ఆయనకు దేవుడు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా'' అని కాశ్మీర్‌ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ విమర్శించారు.

మరో వైపు భారత్ లో ఇజ్రాయిల్ రాయబారి నూర్ గిలోన్ భారత ప్రభుత్వానికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. తమ దేశానికి చెందిన లపిడ్ వ్యాఖ్యలపట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

First Published:  29 Nov 2022 3:05 PM IST
Next Story