దమ్ముంటే మోదీ పేరు చెప్పి ఓట్లడగండి.. - బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయించడంపై ఆయన ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే పేరెత్తకుండా నరేంద్ర మోదీ పేరు చెప్పి ఓట్లడిగే దమ్ముందా అని ఉద్ధవ్ ఠాక్రే భారతీయ జనతా పార్టీని సవాల్ చేశారు. ఆదివారం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన బీజేపీని అందరూ అంటరాని పార్టీగా చూసిన సమయంలో తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయించడంపై ఆయన ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం అధికారంలో ఉన్నవారి బానిస అని విమర్శించారు. అది మోసకారి కమిషన్ అని మండిపడ్డారు. తమ నుంచి పార్టీ పేరును, గుర్తును తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివసేనను క్రూరంగా అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఉద్దవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అత్యధిక సంఖ్యలో అవినీతి పరులు బీజేపీలో ఉన్నారని ఆయన తెలిపారు. తొలుత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులను బీజేపీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తోందని, ఆ తర్వాత అవినీతి ఆరోపణలు వచ్చినవారినే ఆ పార్టీలో చేర్చుకుంటోందని విమర్శించారు.