కలిసి రాకపోతే క్లారిటీగా చెప్పేయండి.. ఇండియా కూటమి పక్షాలకు కాంగ్రెస్ సూచన
ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరు జారిపోతున్న నేపథ్యంలో మిగిలిన భాగస్వామ్య పక్షాల మదిలో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ జైరామ్ రమేష్‌తో ఈ కామెంట్లు చేయించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఏర్పడిన విపక్ష ఇండియా కూటమిలో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎవరికి వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసేసుకుంటుండటంతో కూటమిలో పెద్దన్న కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. కూటమిగా కలిసి పోటీచేయలేని పక్షంలో ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తాజాగా వ్యాఖ్యానించడం కూటమిలో కన్‌ఫ్యూజన్‌ను చాటిచెబుతోంది.
టీఎంసీ, ఆప్ హ్యాండిచ్చేశాయి
లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తేల్చిచెప్పేశాయి. మరోవైపు కూటమిలో కీలకమనుకున్న నితీష్‌కుమార్ జెల్ల కొట్టి ఏకంగా ఎన్డీయేలో చేరిపోవడం కాంగ్రెస్‌కు పెద్ద షాకే.
తప్పు కాంగ్రెస్‌దేనా?
ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరు జారిపోతున్న నేపథ్యంలో మిగిలిన భాగస్వామ్య పక్షాల మదిలో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ జైరామ్ రమేష్‌తో ఈ కామెంట్లు చేయించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మూడు నెలల కిందట జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్సే కూటమి ఐక్యతకు దెబ్బకొట్టిందని భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ఇండియా కూటమి బీటలు వారుతుండటం బీజేపీకి మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది.