మనం కలిస్తే.. బీజేపీకి 100 సీట్లు కూడా రావు.. - బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
భారత్ జోడో వంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విపక్షాల ఐక్యత విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని నితీశ్ చెప్పారు. గతంలో ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ను, సోనియాను తాను కలిసినట్టు వివరించారు.
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షలన్నీ ఏకమై పోటీ చేస్తే బీజేపీకి 100 సీట్లు కూడా రావని ఆయన స్పష్టం చేశారు. విపక్షాల పొత్తులపై కాంగ్రెస్ పార్టీ చర్చలు మొదలుపెట్టాలని ఆయన సూచించారు. పాట్నాలో జరిగిన సీపీఐ-ఎంఎల్ జాతీయ సదస్సుకు హాజరైన నితీశ్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నామని, దేశ ప్రధాని పదవిపై తనకు వ్యక్తిగతంగా కోరిక లేదని, తాము మార్పు మాత్రమే కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. సమష్టిగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఓకే అని తెలిపారు.
భారత్ జోడో వంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విపక్షాల ఐక్యత విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని నితీశ్ చెప్పారు. గతంలో ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ను, సోనియాను తాను కలిసినట్టు వివరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. విపక్షాల మధ్య విభేదాలు ఉంటే సరిచేసుకుని ముందుకు సాగాలని సూచించారు. బీహార్‌లో ప్రతిపక్షాలు ఐక్యంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.