కోవిడ్ మరణాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
ఎవరికైనా కరోనా పాజిటీవ్ ఉన్నప్పుడు వేరే శారీరక రుగ్మతలతో మరణించినా దాన్ని కోవిడ్ మరణంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. కోవిడ్ కారణంగా మరణించిన 30 రోజుల్లోగా వారి కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించాలని కూడా కోర్టు రూలింగ్ ఇచ్చింది.
కోవిడ్ మరణాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కరోనా రోగికి చికిత్స జరుగుతున్న సమయంలో మరేవైనా ఇతర శారీరక రుగ్మతలతో ఆ రోగి మరణించినప్పటికీ దాన్ని కోవిడ్ మరణంగానే పరిగణించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మృతికి కారణం రోగి గుండెపోటు..లేదా గుండెజబ్బు లేక మరేదైనా కావచ్చు.. కానీ అప్పటికీ దాన్ని కోవిడ్ కారణంగానే మరణించినట్టు భావించాలి అని న్యాయమూర్తులు జస్టిస్ ఏఆర్. మసూద్, జస్టిస్ విక్రమ్ డీ చౌహాన్ లతో కూడిన డివిజన్ బెంచ్ ప్రకటించింది. కోవిడ్ కారణంగా మరణించిన 30 రోజుల్లోగా వారి కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించాలని కూడా న్యాయమూర్తులు రూలింగ్ ఇచ్చారు. ఈ 30 రోజుల్లోగా ఎక్స్ గ్రేషియా చెల్లించని పక్షంలో 9 శాతం వడ్డీతో దాన్ని కట్టవలసి ఉంటుందని బెంచ్ స్పష్టం చేసింది. కోవిడ్ వైరస్ కి సంబంధించి ఇన్ఫెక్షన్ దేహంలోని ఏ భాగానికైనా సోకి దాన్ని డ్యామేజ్ చేయవచ్చునని, ఇది కూడా రోగి మృతికి దారి తీస్తుందని పేర్కొంది. అంటే రోగి శరీరంలోని అవయవం సరిగా పని చేయలేక అతడు చనిపోతే అందుకు మరో రుగ్మత కారణం కాదని.. కోవిడ్ వల్లనేనని భావించాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
తమ కుటుంబంలో కోవిడ్ కారణంగా ఒకరు మరణిస్తే.. దానికి మరో కారణం చెప్తూ తమకు పరిహారం కూడా చెల్లించలేదంటూ కొందరు పిటిషనర్లు కోర్టుకెక్కారు. వారి పిటిషన్లను విచారించిన సందర్భంగా కోర్టు ఈ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్లకు ప్రభుత్వం 25 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని , ఇప్పటికే 30 రోజుల టైం లిమిట్ దాటిపోయిందని జస్టిస్ మసూద్, జస్టిస్ విక్రమ్ డీ చౌహాన్ అన్నారు. కోవిడ్ మరణాలకు పరిహారం చెల్లింపు విషయంలో గత ఏడాది జూన్ 1 న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోని క్లాజు 12 ని పిటిషనర్లు సవాలు చేశారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్ఫు.. కోవిడ్ బాధిత కుటుంబాలకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.