Telugu Global
National

సోనియాగాంధీ పై ఈడీ విచారణ లైవ్ ఇస్తారా?

సోనియా గాంధీని ఈడీ విచారణ పేరుతో వేదింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నిజంగా ఈడీకి నిజాయితీ ఉంటే ఆమెను చేసే విచారణ లైవ్ టెలీకాస్ట్ చేయాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ డిమాండ్ చేశారు.

సోనియాగాంధీ పై ఈడీ విచారణ  లైవ్ ఇస్తారా?
X

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ తీవ్రంగా తప్పు పట్టారు. 75 ఏళ్ళ మహిళ.. అందులోనూ అనారోగ్యంగా ఉన్న ఆమెను ఈడీ అధికారులు నిన్న రెండు గంటలకు పైగా విచారించారని, మీకు దమ్ముంటే ఈడీ ఆఫీసులో కెమెరాలు పెట్టి ఆ తంతును లైవ్ చేసి చూపాలని ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన ఆయన.. సోనియాను విచారించిన గదిలో కెమెరాలు పెట్టి ఆ లింకులను అన్ని న్యూస్ ఛానెళ్లకు షేర్ చేయాలన్నారు. లేదా ఆ రూమ్ లో ఛానెళ్ల కెమెరాలను అనుమతించాలన్నారు. ఇలా చేసే ధైర్యం మీకుందా ? ఈడీ అధికారులు ఏ ప్రశ్నలడిగారు.. వాటికి సోనియా ఎలాంటి సమాధానాలిచ్చారు వంటి విషయాలను ప్రజలు తెలుసుకోగోరుతున్నారని ఆయన అన్నారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లోని ఈడీ కార్యాలయం వద్ద జరిగిన కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అసలు స్కామ్ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. సోనియాను ఈడీ కార్యాలయానికి పిలిపించి మోడీ ప్రభుత్వం ఆమెను వేధిస్తోందని, కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితిని కూడా పట్టించుకోలేదని భూపేష్ బాఘేల్ ఆరోపించారు. ఆమెను ఆఫీసుకు పిలిపించి విచారించే బదులు ఆమె నుంచి లిఖిత పూర్వక సమాధానాలు తీసుకోవాల్సింది అన్నారాయన. సోనియా తిరిగి ఈ నెల 25 న ఈడీ విచారణకు హాజరు కావలసి ఉంది.

అటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఈడీ అధికారులను దుయ్యబట్టారు. సోనియాను వారు తమ కార్యాలయానికి పిలిపించే బదులు వాళ్లే ఆమె నివాసానికి వెళ్లి ప్రశ్నించి ఉండవచ్చు కదా అని ఆయన అన్నారు. ఇది రాజకీయ కక్ష కాక మరేమిటన్నారు. కోవిడ్ కి గురైన కారణంగా తనను ఇక వెళ్లిపోయేందుకు అనుమతించాలని సోనియా కోరినందువల్లే తాము అంగీకరించామన్న ఈడీ అధికారుల వ్యాఖ్యలను కాంగ్రెస్ మరో నేత జైరాంరమేష్ కొట్టిపారేశారు. ఇవి నిరాధారమైనవన్నారు. ఈ కేసులో ఇక అడిగే అంశాలేవీ లేనందువల్లే విచారణ ముగిసిందని, నిజానికి మీరు ఎప్పుడు కోరినా అప్పుడు వస్తానని సోనియా గాంధీ.. వారికి చెప్పారని ఆయన తెలిపారు. మరోవైపు జైరాం రమేష్ వ్యాఖ్యలను ఈడీ వర్గాలు ఖండిస్తూ సోనియా పట్ల తాము మానవతా దృక్పథంతో వ్యవహరించామని, ఇద్దరు డాక్టర్లను, ఓ అంబులెన్స్ ను స్టాండ్ బైగా ఉంచామని, పైగా ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ రెండుసార్లు తన తల్లితో భేటీ అయ్యేందుకు అనుమతించామని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. 'మేం 12 ప్రశ్నలు మాత్రమే అడిగాం.. ఆ తరువాత సోనియా తన మందులకోసం ఇంటికి వెళ్తానంటే సరేనన్నాం.. సోమవారం ఆమెను మరికొన్ని ప్రశ్నలు వేస్తామంటే ఆమె అంగీకరించారు కూడా' అని వెల్లడించాయి.






First Published:  22 July 2022 12:45 PM IST
Next Story