Telugu Global
National

బేటీ బచావో అంటే మాటలు కాదు, చేతల్లో చూపించిన డాక్టర్..

ఆ ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పండగ వాతావరణం ఉంటుంది. కేక్ కట్ చేసి, తల్లిదండ్రులకు సన్మానం కూడా చేస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తల్లీబిడ్డకు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ఇంటికి పంపిస్తారు డాక్టర్ గణేష్ రఖ్.

బేటీ బచావో అంటే మాటలు కాదు, చేతల్లో చూపించిన డాక్టర్..
X

బేటీ బచావో, బేటీ పఢావో అంటూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత హడావిడి చేసిందో అందరికీ తెలుసు. ఆ పథకానికి వినియోగించిన నిధులకంటే ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెట్టారంటూ ఆమధ్య పెద్ద రచ్చ అయింది. అయినా కూడా ప్రచార యావ ఉన్న కేంద్రం ఇవేమీ పట్టించుకోలేదు. అయితే బేటీ బచావో అంటే ప్రచారం కాదని, దాన్ని నిజం చేసి చూపించారు పూణేలోని ఓ డాక్టర్. ఆడపిల్లల్ని కాపాడాలంటే ముందు తల్లిదండ్రులకు వారు భారం కాదు అనే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలంటున్నారు. అందుకే తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే.. కాన్పుకయిన ఫీజు మాఫీ చేస్తున్నారు.

పూణే పట్టణంలోని హదప్సర్ ప్రాంతంలో డాక్టర్ గణేష్ రఖ్ మెటర్నటి ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఆయన 11 ఏళ్లుగా బేటీ బచావో అనే స్ఫూర్తితో ఈ విధానం ప్రవేశ పెట్టారు. తన ఆస్పత్రిలో ఆడబిడ్డను ప్రసవించే మహిళకు ఫీజు మాఫీ చేస్తున్నారు. లింగ వివక్షను తొలగించడం గురించి అవగాహన కల్పించడానికే ఈ పద్ధతి ప్రారంభించానంటున్నారు గణేష్ రఖ్. ఇప్పటి వరకు ఆయన ఆస్పత్రిలో 2,400 మంది ఆడపిల్లలు పుట్టారని రికార్డులు చెబుతున్నాయి. అంటే 2400మంది వద్ద ఆయన ఫీజు వసూలు చేయకుండా ఇంటికి పంపించారు.

అంతే కాదు.. ఆ ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పండగ వాతావరణం ఉంటుంది. కేక్ కట్ చేసి, తల్లిదండ్రులకు సన్మానం కూడా చేస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తల్లీబిడ్డకు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ఇంటికి పంపిస్తారు డాక్టర్ గణేష్ రఖ్. 11 ఏళ్లుగా ఆయన చేస్తున్న పని స్థానికంగా అందరికీ తెలిసినా తగిన ప్రచారం మాత్రం లేదు. అసలు ప్రచారం చేసుకోవాలని కూడా ఆయన అనుకోలేదు. కేవలం తన ఆస్పత్రిలో ఆడబిడ్డలు పుడితే ఫీజు మాఫీ అని ప్రచారం చేస్తారు కానీ, అది తన ఘనత అని ఎప్పుడూ చెప్పుకోరు డాక్టర్ రఖ్. పేరుగొప్ప పథకాల ప్రచారానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రానికి, అలాంటి సున్నిత సమస్యలకు ఉన్నత సమాధానం కనిపెట్టిన డాక్టర్ రఖ్ వంటి వారికి చాలా తేడా ఉంది.

First Published:  7 Nov 2022 9:30 AM GMT
Next Story