సీఏ పరీక్ష.. ఇక ఏడాదికి మూడు సార్లు.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలులోకి
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలను ఇప్పటివరకు మే లేదా జూన్ నెలల్లో ఒకసారి, నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో మరోసారి నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలు ఇకపై ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని ఐసీఏఐ వెబ్‌సైట్ త్వరలో అధికారికంగా వెల్లడించనుందని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలను ఇప్పటివరకు మే లేదా జూన్ నెలల్లో ఒకసారి, నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో మరోసారి నిర్వహిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరం నుంచి దీనిని మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు దీనిని బట్టి అర్థమవుతోంది. ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షలు రాయడానికి అర్హులు.
సీఏ పరీక్షలు మూడు స్థాయిల్లో ఉంటాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్.. గా వాటిని పిలుస్తారు. తొలుత ఫౌండేషన్ పరీక్ష ఉత్తీర్ణులైతే సీఏ ఇంటర్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోని రెండు గ్రూపులు పాసైన తర్వాత సీఏ ఫైనల్ పరీక్షలకు హాజరుకావచ్చు. ఒకవేళ డిగ్రీ పూర్తయిన విద్యార్థులైతే ఫౌండేషన్ పరీక్ష రాయకుండానే నేరుగా సీఏ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే అవకాశముంటుంది. దేశవ్యాప్తంగా ఏటా సుమారు లక్షా 25 వేల మంది ఫౌండేషన్ కోర్సులో ప్రవేశాలు పొందుతున్నారు.