Telugu Global
National

చెత్త కలెక్ట్ చేయడానికి వాహనం నడుపుకుంటూ వచ్చిన ఐఏఎస్ అధికారి

జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు చెత్తను ఓపెన్ ల్యాండ్స్‌లో పడేస్తున్నారు. మరోవైపు డోర్ టూ డోర్ కలెక్ట్ చేయాలనే లక్ష్యం కూడా 100 శాతం నెరవేరడం లేదు. అందుకే క్షేత్ర స్థాయిలో ఉండే ఇబ్బందులు తెలుసుకోవడానికి సీఈవో ఇలా చెత్తను సేకరించే పని పెట్టుకున్నారు.

చెత్త కలెక్ట్ చేయడానికి వాహనం నడుపుకుంటూ వచ్చిన ఐఏఎస్ అధికారి
X

చెత్త సేకరించడానికి వచ్చే వాహనం కోసం ఎదురు చూస్తున్న ఓ గ్రామ ప్రజలకు.. ఆ వాహనం నడుపుకుంటూ వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. తాము చూసింది కలా నిజమా అనే అనుమానంతో కాసేపు ఉండిపోయారు. ఎందుకంటే ఆ వాహనాన్ని స్వయంగా జెడ్పీ సీఈవో నడుపుకుంటూ రావడమే. ఈ సంఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లా బడగబెట్టు గ్రామంలో జరిగింది. ఉడిపి జిల్లా సీఈవో హెచ్. ప్రసన్న ఉదయాన్నే వాహనాన్ని నడుపుకుంటూ వచ్చి చెత్తను సేకరించారు. ఆయనతో పాటు గ్రామ పంచాయతి పారిశుథ్య కార్మికులు కూడా ఉన్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి తిరుగుతూ చెత్తను సేకరించడంతో పాటు, గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు.

జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు చెత్తను ఓపెన్ ల్యాండ్స్‌లో పడేస్తున్నారు. మరోవైపు డోర్ టూ డోర్ కలెక్ట్ చేయాలనే లక్ష్యం కూడా 100 శాతం నెరవేరడం లేదు. అందుకే క్షేత్ర స్థాయిలో ఉండే ఇబ్బందులు తెలుసుకోవడానికి సీఈవో ఇలా చెత్తను సేకరించే పని పెట్టుకున్నారు. చెత్తను ఆరుబయట పడేయవద్దని, తప్పకుండా వాహనం వచ్చినప్పుడు అందులో వేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దాదాపు మూడు గంటల పాటు గ్రామంలో వాహనం వేసుకొని తిరిగారు. మరోవైపు ప్రజలు కూడా తమ సమస్యలను వివరించారు. చెత్త సేకరించే టీమ్ కనీసం రెండు రోజులకు ఒకసారైనా రావడం లేదని, చెత్త పేరుకొని పోతుండటంతో తాము బయట పడేయాల్సి వస్తుందని వివరించారు. ఈ విధానంలో మరిన్ని మార్పులు తీసుకురావాలని, వాహనాల సంఖ్యను పెంచాలని వారు కోరారు.

స్వచ్ఛ సేవా క్యాంపెయిన్‌లో భాగంగానే సీఈవో ప్రసన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి కూడా పలు సూచనలు చేశారు. కాగా, చెత్తను సేకరించడం చాలా కష్టమైన పని అని సీఈవో చెప్పారు. ఈ రోజు స్వయంగా వాహనాన్ని నడుపుతూ ఇంటింటికీ తిరిగినప్పుడు తనకు ఆ అనుభవం అర్థమైందని చెప్పారు. ఇక గ్రామస్తులు కూడా తనకు సహకరించారని, చెత్త సేకరణలో మరింత మెరుగైన విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పుకొచ్చారు.

First Published:  26 Sept 2022 8:05 AM IST
Next Story