భారత్ లో మహిళలు ఆయుధాలు ధరించాల్సిందేనా..?
ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు వేర్వేరు తీర్పులను ఉటంకిస్తూ స్మితా సబర్వాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు ధరించి భారత్ లోని మహిళలు తమను తాము రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారామె.
"మహిళలకు న్యాయస్థానాల్లో కూడా అన్యాయం జరిగితే ఇక ఏం చేయాలి..? తీర్పులన్నీ మహిళా లోకాన్ని నిరాశకు గురిచేస్తున్న వేళ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి..? భారతదేశంలో మహిళలకు ఆయుధాలు ధరించే హక్కు ఇవ్వాల్సిందేనా, ఆ సమయం ఆసన్నమైనట్టేనా..? న్యాయం, చట్టం అనేవి రెండూ వేర్వేరు విషయాలు కావు.." ఇది ఓ మహిళా ఐఏఎస్ అధికారి ఆవేదన. ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు వేర్వేరు తీర్పులను ఉటంకిస్తూ ఆమె ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంఓలో సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు మహిళా లోకాన్ని ఆలోచనలో పడేసింది. వరుసగా వెలువడుతున్న ఇలాంటి తీర్పులపై చర్చకు తెరలేపింది.
If this trend of Judicial let-downs continue, it may be time to allow women of this country the Right to bear Arms !
— Smita Sabharwal (@SmitaSabharwal) November 8, 2022
'Justice and Law cannot be two different things'. #shameful pic.twitter.com/JUrWKq2frY
ముందస్తు విచారణకు అవకాశం లేకపోవడంతో ఇటీవల ఓ గ్యాంగ్ రేప్ నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్ట్ శిక్షను తగ్గించింది. వెంటనే బెయిల్ పై విడుదల చేసింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ముగ్గురు గ్యాంగ్ రేప్ నిందితులను సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఈ రెండు ఉదాహరణలను స్మితా సబర్వాల్ తన ట్వీట్ లో ప్రస్తావించారు. షేమ్ ఫుల్ అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించి తన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో బిల్కిస్ బానో ఉదంతంపై కూడా స్మితా సబర్వాల్ ఇంతే ఘాటుగా స్పందించారు. ఇటీవల న్యాయస్థానాల్లో వస్తున్న తీర్పులు మహిళలకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. రేప్ కేసుల్లో నిందితులు సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. బెయిల్ పై బయటకు రావడమే కాదు, ఏకంగా నిర్దోషులుగా విడుదలవుతున్నారు. ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు మహిళల భద్రతపై ఎవరికి మాత్రం నమ్మకం ఉంటుంది. ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఇండోర్ బెంచ్ ఇచ్చిన తీర్పు తీవ్ర విమర్శలు తావిచ్చింది. నాలుగేళ్ల బాలికను రేప్ చేసిన ఓ నిందితుడికి బెయిలిస్తూ.. బెంచ్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని నివ్వెరపరిచాయి. రేప్ చేసినా ఆ బాలికను చంపేయకుండా ఆ నిందితుడు మానవత్వంతో వదిలేశాడని చెబుతూ శిక్ష తగ్గించి బెయిలిచ్చారు న్యాయమూర్తులు. ఇలాంటి తీర్పులన్నీ న్యాయవ్యవస్థను సైతం బోనెక్కించేలా ఉన్నాయి.
కఠిన శిక్షలు ఉన్నాయని తెలిసినా కూడా ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అవి కేవలం శిక్షలే, అమలులోకి రావు అని తేలిపోతే ఈ దుర్మార్గాలు మరింత పెరగడం ఖాయం. ఇప్పుడు వస్తున్న తీర్పులతో ఇలాంటి పరిస్థితే కనపడుతోందని, ఆడవారిని కోర్టులు రక్షించలేవని, ఆయుధాలు ధరించి తమను తాము రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నట్టుగా స్మితా సబర్వాల్ ఆలోచనాత్మక ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు చాలామంది మద్దతిస్తున్నారు.