Telugu Global
National

ఐఏఎస్ హత్య కేసు.. శిక్షా కాలం ముగియక ముందే బీహార్ మాజీ ఎంపీ విడుదలపై సుప్రీంకోర్టులో విచారణ

కృష్ణయ్య భార్య ఉమాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉమాదేవి పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలు విచారించారు.

ఐఏఎస్ హత్య కేసు.. శిక్షా కాలం ముగియక ముందే బీహార్ మాజీ ఎంపీ విడుదలపై సుప్రీంకోర్టులో విచారణ
X

బీహార్‌కు చెందిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌కు శిక్షా కాలం ముగియక ముందే విడుదల చేయడంపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1994లో అప్పటి గోపాల్ గంజ్ మెజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ దోషి. ఆనంద్ మోహన్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే శిక్షాకాలం ముగియకముందే బీహార్ ప్రభుత్వం అతన్ని విడుదల చేసింది. ఆనంద్ మోహన్ విడుదల కోసం బీహార్ ప్రభుత్వం ఏకంగా ఆ రాష్ట్ర జైలు మాన్యువల్‌నే మార్చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కృష్ణయ్య భార్య ఉమాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉమాదేవి పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలు విచారించారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 26 కు వాయిదా వేశారు.

అయితే విచారణ సందర్భంగా ఉమాదేవి తరఫున హాజరైన సీనియర్ లాయర్ సిద్దార్థ‌ లూద్ర రెమిషన్ ప్రక్రియకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను కోరారు. దీనికి బీహార్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ లాయర్ రంజిత్ కుమార్ నిరాకరించారు. రికార్డులను కోర్టుకు మాత్రమే సమర్పిస్తానన్నారు. దీనికి సిద్దార్థ‌ లూద్ర స్పందిస్తూ రెమిషన్ ప్రక్రియలో ఉన్న రహస్యమేంటో అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ తరఫు లాయర్ సమాధానమిస్తూ.. అవసరమైతే ఆర్టీఐ చట్టం ప్రకారం రికార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ రికార్డుల కోసం ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత తాము చూసుకుంటామని ఉమాదేవి తరఫు లాయర్ కు సూచించారు. ఈ కేసుకు సంబంధించి మే 19వ తేదీన జరిగిన విచారణలో రెమిషన్‌కు సంబంధించిన ఒరిజినల్ రికార్డ్స్ అందజేయాల్సిందిగా కోర్టు బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తాజాగా శనివారం జరిగిన విచారణలో రెమిషన్ ప్రక్రియకు సంబంధించి అదనపు సమాచారం కోసం కొంత గడువు కావాలని బీహార్ ప్రభుత్వ తరఫు లాయర్ కోరడంతో ధర్మాసనం రెండు వారాల గడువు ఇచ్చింది.

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన జి.కృష్ణయ్య కష్టపడి చదువుకొని ఐఏఎస్ అయ్యారు. బీహార్ కేడర్ కు అలాట్ అయ్యారు. ప్రజల్లో కృష్ణయ్యకు మంచి పేరుండేది. ఆయన గోపాల్ గంజ్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తుండగా నాటి ఎంపీ ఆనంద్ మోహన్ నేతృత్వంలోని రౌడీ మూక ఆయన కారును అడ్డుకొని కారులో నుంచి దించి రాళ్లతో కొట్టి చంపింది. ఈ కేసులో ప్రధాన దోషిగా తేలిన ఆనంద్ మోహన్ కు కింది కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది.


ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆనంద్ మోహన్ ను విడుదల చేయడానికి బీహార్ ప్రభుత్వం ఏకంగా జైలు మాన్యువల్‌నే మార్చుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలు తప్పుబట్టాయి. నిరసన వ్యక్తం చేశాయి. హైదరాబాద్ లో నివసిస్తోన్న కృష్ణయ్య భార్య ఉమాదేవి బీహార్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఆమెకు అటు ఐఏఎస్,ఐపీఎస్ సంఘాలతో పాటు దళిత సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.

First Published:  12 Aug 2023 7:13 PM IST
Next Story