సోనియా గాంధీ నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తారో లేదో తెలియదు.. - కర్నాటక సీఎం ఎంపిక వేళ డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
కర్నాటక సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, తాను మాత్రం తన బాధ్యతలు నిర్వర్తించానని డీకే చెప్పారు. ఢిల్లీ వెళ్లే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఢిల్లీ వెళతానో లేదో తెలియదని అన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం అనంతరం సీఎం ఎంపిక వ్యవహారం సర్వత్రా ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. కర్నాటక ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు అయిన సోమవారం (మే 15) నాడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీ తనకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తారో లేదో తెలియదని డీకే అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి విధేయుడినని చెప్పారు. తనపై బీజేపీ అక్రమ కేసులు పెట్టి ఇరికించినప్పుడు సోనియా తనతో ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తనపై నమ్మకంతో సోనియా తనను పీసీసీ చీఫ్ చేశారని, కర్నాటక ప్రజలు తనను నమ్మి తమ పార్టీకి భారీ విజయాన్ని అందించారని తెలిపారు. ఇంతకన్నా బర్త్‌డే గిఫ్ట్ ఏముంటుందని ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కర్నాటక సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, తాను మాత్రం తన బాధ్యతలు నిర్వర్తించానని డీకే చెప్పారు. ఢిల్లీ వెళ్లే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఢిల్లీ వెళతానో లేదో తెలియదని అన్నారు.
మరోపక్క అధిష్టానం పంపిన ఏఐసీసీ పరిశీలకులు ఆదివారం నాడు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి.. సీఎం అభ్యర్థి విషయమై 135 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ఈ బృందం తాము సేకరించిన అంశాలపై సోమవారం మధ్యాహ్నం అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. ఇదిలావుంటే మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మొగ్గు చూపుతున్నారని ఊహాగానాలు వస్తుండగా, అధిష్టానం మాత్రం షేరింగ్ ఫార్ములాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కర్నాటకలో గురువారం నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.