Telugu Global
National

నాకు సోనియా మ‌ద్ద‌తు లేదు -మల్లికార్జున్‌ ఖర్గే

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మద్దతు తనకు లేదని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, తనను కించపరిచేందుకే ఎవరో ఈ పుకార్ల‌ను వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

నాకు సోనియా మ‌ద్ద‌తు లేదు -మల్లికార్జున్‌ ఖర్గే
X

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నుంచి తనకు మద్దతు లభిస్తుందన్న ఊహాగానాలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్టీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్‌ ఖర్గే కొట్టిపారేశారు. పార్టీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ తన పేరును ఎన్నడూ సూచించలేదని, అది పుకారు మాత్ర‌మే అని ఖర్గే అన్నారు.

"సోనియా గాంధీ నా పేరును అధ్యక్ష పదవికి సూచించార‌ని, నేనెప్పుడూ అనలేదు. గాంధీ కుటుంబం నుండి ఎవరూ ఎన్నికల్లో పాల్గొనరని లేదా ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వద‌ని ఆమె స్పష్టంగా చెప్పారు" అని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.

"కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, నన్ను కించపరిచేందుకే ఎవరో ఈ పుకార్ల‌ను వ్యాప్తి చేసారు. తాను పార్టీ ఎన్నికలలో పాల్గొనబోనని, ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వబోన‌ని ఆమె స్పష్టంగా చెప్పారు" అని ఖర్గే అన్నారు. పార్టీ సభ్యులు 9300 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారని, ఎక్కువ మంది ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు అధ్యక్షులవుతారని ఖర్గే అన్నారు.

ఉత్తరప్రదేశ్ ఓటర్ల గురించి మాట్లాడుతూ, యూపీలో మొత్తం 1250 మంది ఓటర్లు (ప్రతినిధులు) ఉన్నారని చెప్పారు. "నాకు ఉన్న అవకాశాలను చూసేందుకు నేను ఇక్కడకు రాలేదు, నన్ను పోటీ చేయమని కోరిన అభ్యర్థులే నా గెలుపుకు బాధ్యత వహిస్తారు," అన్నారాయన.

అంతకుముందు, ఖర్గే మాట్లాడుతూ, 'దేశంలో పరిస్థితి దారుణంగా ఉన్నందున నేను పోరాడాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యానికి వ్య‌తిరేకంగా మోడీ, షా రాజకీయాలు చేస్తున్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు నిర్వీర్యమవుతున్నాయి. వాటిపై పోరాడాలంటే నాకు అధికారం కావాలి.. అందుకే.. ప్రతినిధుల సూచన మేరకు నేను ఎన్నికల్లో పోరాడుతున్నాను'' అని ఖర్గే చెప్పారు.

కాగా, అక్టోబర్ 17న ఓటింగ్, అక్టోబర్ 19న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

First Published:  12 Oct 2022 11:34 AM IST
Next Story