నేను రౌడీని, పరీక్షల్లో కాపీ కొట్టి పాసయ్యాను...గొప్పగా చెప్పిన కర్నాటక మంత్రి
కర్నాటక రవాణా శాఖ మంత్రి బి శ్రీరాములు బళ్లారిలోని విద్యా వర్ధక్ సంఘ్ ఎస్‌జి ప్రీ-యూనివర్సిటీ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలో ఛీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఆ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
"నేను క్లాస్‌లో బ్యాక్ బెంచర్‌ని. పరీక్ష సమయంలో కాపీ ఎలా కొట్టాలో 'పీహెచ్‌డీ' చేశాను. నేను నా టీచర్లను ర్యాగింగ్ చేశాను. నేను జీన్స్ వేసుకున్నప్పుడు అమ్మాయిలు నన్ను చూసేవారు. నేను రైడీయిజం చేసి 14 సార్లు జైలుకు వెళ్లాను.'' ఇవి ఏదైనా సినిమాలో హీరోనో, విలనో చెప్పిన డైలాగ్స్ అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇవి కర్నాటకకు చెందిన ఘనత వహించిన ఓ మంత్రి వర్యులు విద్యార్థులకు బోధించిన బోదనలివి.
కర్నాటక రవాణా శాఖ మంత్రి బి శ్రీరాములు బళ్లారిలోని విద్యా వర్ధక్ సంఘ్ ఎస్‌జి ప్రీ-యూనివర్సిటీ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలో ఛీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఆ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
"నేను ర్యాంక్ విద్యార్థిని కాదు. నా టీచర్లలో చాలామంది నాకు చదువు చెప్పడానికి ప్రయత్నించారు, కానీ నాకు ఎందుకు చదువు అబ్బలేదో నాకు తెలియదు. నా ఉపాధ్యాయులు చాలా మంది నన్ను తిట్టారు. నా కాలేజీ రోజుల్లో, నేను కన్నడతో సహా ఏ భాషలోనూ సరిగ్గా మాట్లాడలేనని ఉపాధ్యాయులు చెప్పారు. '' అని శ్రీరాములు అన్నారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాలుగు సార్లు మంత్రి అయ్యానని చెప్పిన శ్రీరాములు, యుక్త వయస్సులో తప్పులు చేయడం సహజమని, దానిని సరిదిద్దుకోవడం మానవ నైజం అన్నారు. తాను పేద ప్రజల కోసం ప్రాణమిచ్చేవాడినని తెలిపారు. విద్యార్థులు కూడా నిత్యం అల్లర్లతో సమయం వృథా చేయకుండా, బాధ్యతగా చదవాలని హితవు పలికారు.
ఇంతకూ తన ఉపన్యాసంతో మంత్రి శ్రీరాములు ఆ కాలేజ్ విద్యార్థులకు ఏం చెప్పదల్చుకున్నారు ?చదువు అబ్బకపోతే...కాపీ కొట్టి పాసైతే...రైడీయిజం చేస్తే...టీచర్లను ర్యాగింగ్ చేస్తే... ఎవరైనా సరే మంత్రులైపోవచ్చనా ?
కొందరు రాజకీయ నాయకులు వేదికలెక్కి ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. వాళ్ళు చెప్పే మాటలతో ప్రజలకు ఏం నేర్పించాలనుకుంటారో వాళ్ళకే తెలియాలి. ఎమ్మెల్యేలు,మంత్రులైతే ఇక ఏమైనా మాట్లాడొచ్చని రాజకీయ నాయకుల అభిప్రాయమా ?