Telugu Global
National

మైనర్ భార్యను నరికి.. ముక్కలను సంచుల్లో పెట్టి అడవిలో పడేసిన భర్త

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప‌రిశీలించారు. తనూజ భర్త కయోమ్ మియా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి గాలింపు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత అతడిని పట్టుకున్నారు.

మైనర్ భార్యను నరికి.. ముక్కలను సంచుల్లో పెట్టి అడవిలో పడేసిన భర్త
X

త్రిపుర రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మైనర్ భార్యను దారుణంగా నరికి చంపిన భర్త.. ఆమె తలను ఒక బ్యాగులో, శరీరాన్ని మరో బ్యాగులో పెట్టి అడవిలో పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన త్రిపురలో సంచలనం సృష్టిస్తోంది. అగర్తలకు చెందిన తనూజ బేగమ్ కు 8 నెలల క్రితం కయోమ్ మియా అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. తనూజకు 15 సంవత్సరాలే అయినప్పటికీ పెద్దలు పెళ్లి జరిపించారు. ఆ తర్వాత కయోమ్ మియా దంపతులు ముస్లింపారా ప్రాంతంలో నివాసం ఉండేవారు.

ఇదిలా ఉండగా.. తనూజ కనిపించడం లేదని ముస్లింపారాకు చెందిన కొంతమంది వ్యక్తులు ఆమె తల్లికి శుక్రవారం సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె ముస్లింపారాకు వచ్చి కూతురు ఇంటికి వెళ్ళింది. ఇంటి తలుపులు తెరచి చూడగా ఆమెకు ఇంట్లో రక్తపు మరకలు కనిపించాయి. తన కూతురుకు ఏం జరిగిందోనని ఆమె గట్టిగా ఏడవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప‌రిశీలించారు. తనూజ భర్త కయోమ్ మియా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి గాలింపు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత అతడిని పట్టుకున్నారు. విచారణలో తన భార్యను తానే చంపినట్లు కయోమ్ మియా ఒప్పుకున్నాడు. గురువారం రాత్రి హత్య చేసి మృతదేహాన్ని అడవిలో పడేసినట్లు చెప్పాడు.

కయోమ్ మియా ఇచ్చిన సమాచారంతో పోలీసులు అడవికి వెళ్లగా అక్కడ రెండు బ్యాగులు కనిపించాయి. ఒక బ్యాగులో తనూజ తల, మరో బ్యాగులో శరీరం కనిపించింది. మైనర్‌ను పెళ్లాడి హత్య చేసిన కయోమ్ మియాను అరెస్టు చేశామని అతడు భార్యను ఎందుకు హత్య చేయవలసి వచ్చింది..? ఈ హత్యలో ఎవ‌రెవ‌రి హస్తం ఏమైనా ఉంది..? అన్న కోణంలో కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

First Published:  30 April 2023 12:55 PM IST
Next Story