5జీ వేలంలో 700 మెగాహెర్జ్ బ్యాండ్‌కు భారీ డిమాండ్.. ఎందుకో తెలుసా?
ఈసారి అనూహ్యంగా టెలికాం సంస్థలు ఈ 700 Mhz స్పెక్ట్రమ్ కోసం భారీగా బిడ్లు దాఖలు చేశాయి. 40 శాతం బ్యాండ్ విడ్త్ కోసం ఇప్పటికే రూ. 39,300 కోట్ల విలువైన బిడ్లు వేశారు. ఈ ఫ్రీక్వెన్సీ కోసం టెలికాం సంస్థలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయో నిపుణులు విశ్లేషించారు.
దేశంలో 5జీ సేవల కోసం కేంద్రం స్పెక్ట్రమ్‌ను వేలానికి పెట్టింది. జూలై 27న వేలం ప్రారంభం కాగా.. ఐదో రోజు ముగిసే సరికి రూ. 1,49,699 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు 5జీ స్పెక్ట్రమ్ కోసం వేలం పాటలో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 30 రౌండ్ల బిడ్డింగ్ జరగగా.. 70 శాతానికి పైగా స్పెక్ట్రమ్ అమ్ముడు పోయినట్లు టెలికాం మినిస్టర్ వైష్ణవ్ తెలిపారు.
5జీ స్పెక్ట్రమ్ వేలంలో అన్ని కంపెనీలు 700Mhz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కోసం పోటీ పడ్డాయి. 4జీ వేలంలో భాగంగా 2016, 2021లో కూడా ఈ బ్యాండ్‌ను వేలానికి ఉంచినా టెలికాం కంపెనీలు ఆసక్తి చూపలేదు. కానీ ఈసారి అనూహ్యంగా టెలికాం సంస్థలు ఈ 700 Mhz స్పెక్ట్రమ్ కోసం భారీగా బిడ్లు దాఖలు చేశాయి. 40 శాతం బ్యాండ్ విడ్త్ కోసం ఇప్పటికే రూ. 39,300 కోట్ల విలువైన బిడ్లు వేశారు. ఈ ఫ్రీక్వెన్సీ కోసం టెలికాం సంస్థలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయో నిపుణులు విశ్లేషించారు.
700 Mhzపై భారీ పోటీకి రెండు కారణాలు ఉన్నాయి. గతంలో రెండు సార్లు ఈ ఫ్రీక్వెన్సీని అమ్మకానికి పెట్టినప్పుడు భారీ రేటు ఉన్నది. కానీ ఈసారి రేటును 40 శాతానికి పైగా తగ్గించేశారు. దీంతో గతంలో అమ్ముడు పోకుండా మిగిలిన 60 శాతం బ్యాండ్ విడ్త్‌పై టెలికాం కంపెనీలు కన్నేశాయి. 700 Mhzపై 40 శాతం, 800 Mhzపై 15 శాతం, 900 Mhz 17 శాతం బిడ్లు వేశారు.
700 Mhz అనేది లోఫ్రీక్వెన్సీ బ్యాండ్. ఇందులో తరంగాలు మిగిలిన వాటితో పోల్చుకుంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. 600 Mhz, 800 Mhz బ్యాండ్ విడ్త్‌లో కూడా తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా 5జీ సిగ్నల్స్ కోసం ఎక్కువగా 700 Mhz బ్యాండ్‌నే వాడుతున్నారు. 5జీలో పని చేసే మొబైల్, ల్యాప్‌టాప్ ఇతర గ్యాడ్జెట్లను 700 Mhz ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఒకవేళ భారత టెలికాం సంస్థలు 700 Mhz కాకుండా వేరే ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 5జీ సేవలు అందిస్తే.. అందుకు అనుగుణంగా మొబైల్, ల్యాప్‌టాప్‌లలో మార్పులు చేయాలి. ఒకటి రెండు టెలికాం కంపెనీల కోసం అలా తయారు చేయలేవు. అందుకే భారత టెలికాం కంపెనీలు 700 Mhzను టార్గెట్ చేశాయి.
5జీ టెక్నాలజీ చాలా వైవిధ్యంగా పనిచేస్తుంది. 4జీ టెక్నాలజీ అనేది ఒక ఎక్స్‌ప్రెస్‌వేలో కార్లు వెళ్లడం లాగా ఉంటుంది. అంటే విశాలమైన రోడ్లపై వేగంగా కార్లు పరుగులు తీయడం. ఇక్కడ కార్లు అంటే డేటా ప్యాకెట్లుగా ఊహించుకోవాలి. అదే సమయంలో 5జీ టెక్నాలజీ చాలా డిఫరెంట్‌గా పనిచేస్తుంది. చిన్న రోడ్డుపై కార్లు నెమ్మదిగా పరుగులు తీస్తాయి. కానీ ఒక కారుపై మరోకారు, ఆ కార్లపై ఇంకో కారు పెడితే ఎలా ఉంటుంది. 5జీ కూడా అలాగే పని చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. 700Mhzలో చాలా దూరం వరకు సిగ్నల్స్ వెళ్తాయి. దీనికి మరో బ్యాండ్‌విడ్త్‌ను జతచేసి 5జీ డేటా మరింత వేగంగా వెళ్లేలా టెలికాం సంస్థలు చేస్తాయి. లో ఫ్రీక్వెన్సీని హైఫ్రీక్వెన్సీతో లేయర్ చేయడం వల్ల 5జీ టెక్నాలజీ మరింత సమర్థవంతంగా పని చేస్తుందని కౌంటర్‌పాయింట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా తెలిపారు. అందుకే టెలికాం సంస్థలు 700 Mhzపై భారీగా బిడ్లు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.