Telugu Global
National

కాంగ్రెస్ లో ఖ‌ర్గే మార్క్ ఎలా ఉండ‌బోతోంది.. ?

కాంగ్రెస్ లో ఖ‌ర్గే త‌న సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా త‌న ప‌నిని ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల‌లో ప‌ద‌వుల‌లో ఉన్న‌వారు ఒక్కొక్క‌రు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ లో ఖ‌ర్గే మార్క్ ఎలా ఉండ‌బోతోంది.. ?
X

దేశంలో నెలకొని ఉన్న అసత్యాలు, విద్వేషాల వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేస్తుంది. ప్ర‌జా స్వామ్య అప‌హాస్యాన్ని కొన‌సాగ‌నీయ‌దు ' అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎఐసిసి ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న బుధవారంనాడు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన అనంత‌రం ప్ర‌సంగించారు. ఇది తనకు ఉద్వేగభరితమైన ఘట్టమని, ఒక కార్మికుడి కొడుకుని, సామాన్య కార్యకర్తను పార్టీ అధ్యక్షుడిగా చేసినందుకు ప్ర‌తిఒక్క‌రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఖర్గే అన్నారు.

"ఇది కష్ట సమయమని నాకు తెలుసు, కాంగ్రెస్ స్థాపించిన ప్రజాస్వామ్య విధానాల‌ను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను విచ్ఛిన్నం కానీయ‌బోమ‌ని అన్నారు. తన అనుభవంతో కాంగ్రెస్ పార్టీని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ను కాపాడుకోవడం, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం మనందరి ముందున్న లక్ష్యంగా ఉండాల‌ని అన్నారు. కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు.

రాహుల్‌ భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని వృధా కానివ్వబోమని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కాగా, ఖ‌ర్గే కొత్త టీం లో సంస్థాగ‌తంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆయ‌న ప్ర‌చారంలో చెప్పిన‌ట్టుగా ఉద‌య‌పూర్ డిక్ల‌రేష‌న్ ను క‌చ్చితంగా అమ‌లు చేయ‌నున్నార‌ని ఆయ‌న స‌న్నిహ‌తులు చెబుతున్నారు. ఒక వ్య‌క్తికి ఒక ప‌ద‌వి, ఒక కుటుంబానికి ఒక టిక్కెట్‌, యువ‌కులకు ప్రాధాన్యం వంటి నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయ‌నున్నారు. పార్టీ ఎస్సీ, ఓబిసి విభాగాల‌లో యువ‌కుల‌కు ప్రాదాన్యం క‌ల్పించ‌నున్నారు. ఈ ప్ర‌కారం ముందుగా పార్టీలో 50 యేళ్ళ‌ లోపు ఉన్న‌వారిలో స‌మ‌ర్ధులైన వారిని నాయ‌క‌త్వ స్థానాల‌లో నియ‌మిస్తార‌ని ఆ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఖ‌ర్గే త‌న సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా త‌న ప‌నిని ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల‌లో ప‌ద‌వుల‌లో ఉన్న‌వారు ఒక్కొక్క‌రు రాజీనామాలు చేస్తున్నారు. ఖ‌ర్గేకు త‌న బృందాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇచ్చేందుకు పాత వారు రాజీనామాలు చేయాల‌ని పార్టీ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి కె.సి. వేణు గోపాల్ సూచించారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

యూత్ కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న పార్టీ కార్యకర్తలతో సహా మరింత మంది యువకుల‌ను పార్టీ ప‌ద‌వుల్లోకి తీసుకోవ‌చ్చు. తాను వృద్ధుడిన‌ని , వృద్ధ నాయ‌క‌త్వం అనే విమ‌ర్శ‌లును తిప్పి కొట్ట‌డానికి కూడా ఈ చ‌ర్య‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే గాంధీల ఇష్ట ప్ర‌కార‌మే న‌డుచుకుంటార‌న్న అప‌ప్ర‌థ‌ను తొల‌గించుకునేందుకు కూడా వీలుంటుంది. ఇదే స‌మ‌యంలో్ త‌న‌తో పోటీ ప‌డిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ కు కూడా పార్టీలో ముఖ్య ప‌ద‌వితో ప్రాధాన్యం క‌ల్పిస్తార‌ని కూడా విన‌బ‌డుతోంది.

అయితే, సోనియాగాంధీ హ‌యాంలో ఎంపికై ఉన్నత పదవుల్లో ఉన్నవారు అలాగే కొనసాగే అవకాశం ఉందని, ఆ స్థానాల్లో సమూల మార్పులు ఉండే అవకాశం లేదని మరో నేత అభిప్రాయ‌ప‌డ్డారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా భావిస్తున్న కెసి వేణుగోపాల్ కీలకమైన జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) పదవిలో కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

పార్టీలో ఇటీవలే ఒక సంస్థాగత మార్పు జ‌రిగింది. దానిలో భాగంగా జైరామ్ రమేష్‌ను ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) గా రణదీప్ సూర్జేవాలా స్థానంలో నియమించారు. సుర్జేవాలాను కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఒక పదవికి కట్టుబడి ఉండాల‌ని సూచించారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల‌లో ఉన్న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల విష‌యంలో ఖ‌ర్గే నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. కొన్ని చోట్ల అస‌లే ఉండ‌డంలేద‌ని, మ‌రికొన్ని చోట్ల ఈ కార్య‌నిర్వాహ‌క అద్య‌క్షులు ఎక్కువైపోతున్నారంటూ జి-23 స‌భ్యులు స‌హా పార్టీలోని సీనియ‌ర్లు కూడా విమ‌ర్శించేవారు. ఇలా వీరు ఎక్కువ అవ‌డం వ‌ల్ల నిర్ణ‌యాలు తీసుకునే విష‌యంలో జాప్యం జ‌రుగుతోంద‌ని వారిని తొల‌గించాల‌నే అభిప్రాయం ఉండేది. ఒక్కొసారి అహంకారంతో ఘ‌ర్ష‌ణ‌లు కూడా జ‌రిగేవి. అయితే అటువంటి వాటికి తావు లేకుండా దీనిని స్థిర‌మైన నిర్ణ‌యంతో సాద్య‌మైనంత త్వ‌ర‌గా చేప‌ట్ట వ‌చ్చ‌ని ఖ‌ర్గే స‌న్నిహితుడొక‌రు తెలిపారు.

పార్టీ లోని షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబిసి) విభాగాలు కూడా ఖర్గే ఆధ్వర్యంలో బ‌లోపేతం అయ్యే అవ‌కాశాలున్నాయి. ఆ వర్గాల్లో పార్టీని మ‌రింత విస్తరించేందుకు మరిన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఖర్గే దళిత నేపథ్యం ఈ విస్తరణకు దోహ‌ద‌ప‌డ‌వ‌చ్చు .

విపక్షాల ఐక్యత కోసం ఖర్గే చురుకైన ప్రయత్నాలు ..

దాదాపు రెండేళ్లుగా రాహుల్ గాంధీ వివిధ ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక అవగాహన కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా, ఆయ‌న ఆగస్టు 2021లో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో14 మంది ప్రతిపక్ష పార్టీ నాయకులను బ్రేక్ ఫాస్ట్ స‌మావేశంలో కలిశారు.

రాజకీయాలను అర్థం చేసుకోవడంలో ఖర్గేకున్న అపారమైన అనుభవం దృష్ట్యా ప్రతిపక్ష ఐక్యతను ఏకీకృతం చేసేందుకు మ‌రింత ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో జాతీయ పార్టీలతో మ‌రింత చొర‌వ‌గా చేరువ కానున్నారు'' అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

ఖర్గే అపార రాజ‌కీయ అనుభవం ఇతర ప్రతిపక్ష పార్టీల అధినేతలను సంప్రదించే ప్రక్రియను సులభతరం చేయడానికి, వారితో అర్ధవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఏది ఏమైనప్పటికీ, చాలా ప్రతిపక్ష పార్టీలు ఈ ఐక్య ప్రతిపక్షంలో కాంగ్రెస్ ప్ర‌ధాన పాత్రను పోషించ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌నందున ఖ‌ర్గేకు స‌వాలే మ‌రి. అలాగే ముఠా త‌గాదాల‌కు, ఆధిప‌త్య ధోర‌ణ‌ల‌కు పేరున్న కాంగ్రెస్ నాయ‌కుల‌ను ఒకే గాటికి ఎలా తీసుకువ‌స్తారోన‌న్న‌ది కూడా పెద్ద స‌వాలే. ఈ సవాళ్లను ఖర్గే ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిల్సిందే.

First Published:  26 Oct 2022 6:47 PM IST
Next Story