వెబ్ సిరీస్‌తో హత్యకు ప్లాన్.. సాక్ష్యాల మాయం కోసం గూగుల్ సెర్చ్
Shraddha Walker murder case: మానవ శరీర నిర్మాణం అనే అంశాన్ని ఇంటర్నెట్‌లో చదివి శరీరాన్ని ఎలా ముక్కలు చేయాలి, ఎక్కడ కత్తితో కోయాలి అనేది తెలుసుకున్నాడు. తొందరగా పాడయ్యే శరీర భాగాలను ముందుగా పారేసేవాడు. రక్తపు మరకల్ని శుభ్రం చేసేందుకు రసాయనాలను వాడాడు.
ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని 35 ముక్కలుగా కోసి ఆనవాళ్లు లేకుండా పారేసిన ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రోజు రోజుకీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సహజీవనం చేస్తున్న ప్రియురాలు పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో ఈ హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. శరీరాన్ని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడని, ఆ ముక్కలు ఇంట్లో ఉండగానే మరో ప్రియురాలిని రూమ్‌కి పిలిచి ఆఫ్తాబ్ సరసాలాడాడనే విషయం కూడా విస్తుగొలిపేదే. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం పోలీసుల ముందు ఒప్పుకున్నాడట ఆఫ్తాబ్. అప్పుడప్పుడూ ఫ్రిడ్జ్ లోనుంచి శ్రద్ధ తల బయటకు తీసి చూసేవాడని, ఆమెను గుర్తు చేసుకునేవాడని తెలిసింది. మిగతా శరీర భాగాలన్నీ పడేసిన తర్వాత చివరిగా ఆమె తల ఛిద్రం చేసి బయట పడేశాడని నిర్థారణ అయింది.
డెక్స్ టర్ వెబ్ సిరీస్ అసలు కారణం..
సీరియల్ కిల్లర్ వెబ్ సిరీస్‌లు చూడటం ఆఫ్తాబ్‌కి అలవాటు. ఇంగ్లిష్ వెబ్ సిరీస్ డెక్స్ టర్ చూసి శ్రద్ధ హత్యకు ప్లాన్ చేశాడు. సరిగ్గా అందులో చూపించినట్టే శ్రద్ధపై కూర్చుని ఆమె గొంతుకోశాడు. క్రైమ్ షోలో చూపించినట్టుగా మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడు.
ఆనవాళ్లు మాయం..
ఇక సాక్ష్యాధారాలు మాయం చేయడం కోసం గూగుల్‌లో వెతికాడు ఆఫ్తాబ్. మానవ శరీర నిర్మాణం అనే అంశాన్ని ఇంటర్నెట్‌లో చదివి శరీరాన్ని ఎలా ముక్కలు చేయాలి, ఎక్కడ కత్తితో కోయాలి అనేది తెలుసుకున్నాడు. తొందరగా పాడయ్యే శరీర భాగాలను ముందుగా పారేసేవాడు. రక్తపు మరకల్ని శుభ్రం చేసేందుకు రసాయనాలను వాడాడు. రక్తపు మరకలున్న బట్టలను చెత్త బండిలో పడేశాడు. ఎవరైనా ఇంటికొస్తారనుకుంటే ఫ్రిడ్జ్ లోని శరీర భాగాలను కప్ బోర్డ్ లో పెట్టేవాడు. ఇటీవల కొత్త ప్రియురాలిని ఇంటికి పిలిచిన సందర్భంలో కూడా ఇలాగే చేశాడట. ఎవరూ లేని సమయంలో శ్రద్ధ తలను ఏకాంతంగా చూస్తూ గడిపేవాడినని పోలీసుల ముందు చెప్పాడు ఆఫ్తాబ్.
శ్రద్ధ చనిపోయిందనే విషయం తెలియకపోయినా, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని, ఆమె కనిపించడంలేదనే విషయం అందరికీ తెలుసు. ఇలాంటి విషయాల నుంచి తెలిసినవారి దృష్టిని మళ్లించేందుకు శ్రద్ధ ఫోన్ నుంచి స్నేహితులకు అప్పుడప్పుడు హాయ్ అనే మెసేజ్ పెట్టేవాడు ఆఫ్తాబ్. ఆమె సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి చాట్ చేసేవాడు. కానీ ఫోన్ కాల్స్ మాత్రం ఆన్సర్ చేసేవాడు కాదు. ఎక్కువసేపు ఫోన్ స్విచ్చాఫ్ గా ఉండటంతో స్నేహితులకు అనుమానం వచ్చింది. చివరకు శ్రద్ధ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆఫ్తాబ్‌ని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.