Telugu Global
National

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు.. భారీగా నష్టపోనున్న దక్షిణాది రాష్ట్రాలు

జనాభా ప్రాతిపదికన కాకుండా.. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా నియోజకవర్గాల పునర్విభజన, పెంపు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు.. భారీగా నష్టపోనున్న దక్షిణాది రాష్ట్రాలు
X

లోక్‌సభ స్థానాల పునర్విభజనకు సంబంధించిన కీలకమైన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. 2002లో పునర్విభజనపై నిషేధం విధించారు. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే నెక్ట్స్ డీలిమిటేషన్ జరగాలని ఆనాడే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే 2031 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనేది ఖాయం. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అదే సమయంలో ఉత్తరాదిన భారీగా లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి.

డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఎన్వీఎస్ సోము గత వారం పార్లమెంటులో ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇప్పటికే జనాభా ఆధారంగా రాష్ట్రాలకు నిధులను పంచుతుండటంతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఇకపై జనాభా లెక్కలనే ఆధారం చేసుకొని పార్లమెంటు స్థానాలను కూడా పునర్విభజిస్తే దక్షణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయని ఆమె చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఒక అధ్యయనంలో.. 2026 తర్వాత డీలిమిటేషన్ జరిగితే ఎలా ఉండబోతోందో వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం కంటే 32 సీట్లు పెరుగుతుండగా, దక్షిణాది రాష్ట్రాలు 24 సీట్లు కోల్పోవలసి వస్తోంది. ఇది ఉత్తర, దక్షిణాది మధ్య మరింత అంతరం పెరగడానికి కారణమవుతుందని కనిమొళి వెల్లడించారు.

కుటుంబ నియత్రంణను దక్షిణాది రాష్ట్రాలే పకడ్బంధీగా అమలు చేశాయని, ముఖ్యంగా తమిళనాడులో జనాభా పెరుగుదల అతి తక్కువగా 6 శాతం మాత్రమే ఉందన్నారు. కానీ, కుటుంబ నియంత్రణపై దృష్టి పెట్టని ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అంచనాలకు మించి జనాభా పెరిగిందని ఆరోపించారు. ఇప్పుడు జనాభా పరంగా లోక్‌సభ సీట్లు విభజిస్తే.. ఫ్యామిలీ ప్లానింగ్ సక్రమంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కోత, నిర్లక్ష్యంగా ఉన్నందుకు సీట్ల పెంపు జరుగుతోందని దుయ్యబట్టారు.

2019లో చేసిన అధ్యయనం మేరకు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 21 స్థానాలు పెరుగనున్నాయి. అదే సమయంలో తమిళనాడు, కేరళ కలిపి 16 సీట్లు కోల్పోతాయి. ఇక జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాలంటే లోక్‌సభలో ఇప్పుడున్న సీట్లను 848కి పెంచాలి. అదే సమయంలో యూపీలో 80 ఉన్న సీట్లు 143కు పెరుగుతాయి. కానీ కేరళలో మాత్రం ఒక్క సీటు కూడా పెరగదు. అంటే జనాభాను ప్రాతిపదికన తీసుకుంటే రాష్ట్రాల మధ్య ఎంత అసమానంగా సీట్ల పెరుగుదల ఉండబోతోందో ఆ అధ్యయనం వివరించింది.

రాజ్యాంగం ప్రకారం ప్రతీ సెన్సెస్ తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన జరగాలి. కానీ దాని వల్ల క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే 1976 తర్వాత ఇందిరా గాంధీ లోక్‌సభ స్థానాల పునర్విభజనపై నిషేధం పెట్టారు. ఆ తర్వాత 2002లో వాజ్‌పేయి ప్రభుత్వం నిషేధం ఎత్తేసి నియోజకవర్గాలను పునర్విభజించారు. తిరిగి 2009లో నిషేధం విధించారు. ఈ నిషేధం 2026 తర్వాత తొలిగిపోనున్నది. దీంతో దేశవ్యాప్తంగా నియోజకవర్గాలను పునర్విభజించడానికి బీజేపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

లోక్‌సభ స్థానాల పునర్విభజన కారణంగా బీజేపీ దేశంలో మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాదిలో బీజేపీ మరింత బలం పెంచుకుంటుందని.. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీల లోక్‌సభ స్థానాలు తగ్గి.. పార్లమెంటులో ప్రాతినిథ్యం కూడా తగ్గిపోతుందని వాదిస్తున్నాయి. బీజేపీ కేవలం తమ స్వార్థ్యం కోసమే ఈ పునర్విభజన పట్ల చాలా ఆసక్తిగా ఉందని కూడా దక్షిణాది పార్టీలు ఆరోపిస్తున్నాయి.

జనాభా ప్రాతిపదికన కాకుండా.. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా నియోజకవర్గాల పునర్విభజన, పెంపు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా కట్టబోయే పార్లమెంట్ భవనంలో లోక్‌సభ కోసం 888 సీట్ల కెపాసిటీతో భవనాన్ని నిర్మిస్తున్నారు. అంటే భవిష్యత్‌లో సీట్లు పెరిగినా ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతో భారీగా నిర్మిస్తున్నారు. కాబట్టి.. జనాభా ప్రాతిపదికన కాకుండా.. మరో విధంగా సీట్లను పెంచాలని కోరుతున్నారు. మరి ఎన్టీయే ప్రభుత్వం ఈ సూచనలు పట్టించుకుంటుందా అనేది అనుమానమే. అందుకే ఈ నిర్ణయంపై దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి రావల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  30 Dec 2022 7:20 AM IST
Next Story