Telugu Global
National

రాజ్యాంగంలోకి 'భారత్' అనే పేరు ఎలా వచ్చింది.. మన దేశం 'ఇండియా' ఎలా అయ్యింది?

రాజ్యాంగం తొలి ముసాయిదాను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1948 నవంబర్ 4న తొలి సారి ప్రవేశపెట్టినప్పుడు అందులో 'భారత్' అనే పదమే లేదు.

రాజ్యాంగంలోకి భారత్ అనే పేరు ఎలా వచ్చింది.. మన దేశం ఇండియా ఎలా అయ్యింది?
X

ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ. ఇండియా పేరును భారత్‌గా మారుస్తున్నారని.. త్వరలోనే మోడీ సర్కారు బిల్లు పెట్టబోతోందని సామాన్యుడి నుంచి స్కాలర్ల వరకు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే 'భారత్' అంశంపై రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో వాదోపవాదాలు చేస్తున్నారు. సహజంగానే మోడీ, బీజేపీ అభిమానులు 'భారత్'కు జై అని అంటుండగా.. అసలు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని మరో వర్గం వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా.. అసలు రాజ్యాంగంలోకి 'భారత్' అనే పదం ఎలా చేరింది. ఇండియా అని మన దేశాన్ని ఎలా పిలుస్తున్నారనేది ఒక సారి పరిశీలిద్దాం.

రాజ్యాంగం తొలి ముసాయిదాను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1948 నవంబర్ 4న తొలి సారి ప్రవేశపెట్టినప్పుడు అందులో 'భారత్' అనే పదమే లేదు. బీఆర్ అంబేద్కర్ దేశాన్ని ఇండియాగానే సంబోధిస్తూ రాజ్యాంగ ముసాయిదాను పూర్తి చేశారు. దీన్ని ప్రవేశపెట్టిన సమయంలో స్థానికంగా పిలిచే 'భారత్' అనే పేరు లేకపోవడంపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జాతీయ అసెంబ్లీలో దీనిపై దాదాపు ఒక ఏడాది పాటు చర్చోపచర్చలు జరిగాయి. చివరిగా రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించడానికి ముందు ఒక సవరణ ద్వారా 'ఇండియా.. దటీజ్ భారత్, షల్ బీ యూనియన్ ఆఫ్ స్టేట్స్' అని చేర్చారు. 1949 సెప్టెంబర్ 18న అంబేద్కర్ ఆర్టికల్ 1కు సంబంధించిన సవరణను ప్రతిపాదించిన తర్వాతే 'భారత్' అనే పేరు రాజ్యాంగంలోకి వచ్చి చేరింది.

ఆర్టికల్ 1లో భారత్ అనే పేరు చేర్చడంపై ఏడాది పాటు చర్చలు జరిగాయి. 'ఇండియా.. దటీజ్ భారత్' అనే వాక్యంపై కూడా తీవ్ర వివాదం నెలకొన్నది. ఇలా పేర్కొనడం గందరగోళంగా ఉందని అసెంబ్లీ సభ్యుడు హెచ్‌వీ కామత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి బదులుగా 'భారత్.. ఇన్ ఇంగ్లీష్ ఇండియా, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్' అని చేర్చాలని.. లేదంటే 'హింద్, ఇన్ ఇంగ్లీష్ ఇండియా, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్' అనైనా మార్చాలని పట్టుబట్టారు. ఇందుకు పలు దేశాల రాజ్యాంగంలో ప్రస్తావించిన విషయాన్ని కూడా పేర్కొన్నారు.

ఐర్లాంగ్ తమ రాజ్యాంగంలో రాసుకున్న విషయాన్ని కామత్ ఉదహరించారు. 'ది నేమ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఐర్, ఇన్ ఇంగ్లీష్ ఐర్లాండ్' అని వారు రాసుకున్నారని.. అదే విధంగా ఆర్టికల్ 1లో మార్పులు చేయాలని సూచించారు. ఇంగ్లీషులో మాత్రమే ఇండియా అని పిలుస్తారని.. చాలా దేశాలు ఇండియాను హిందుస్తాన్‌గా గుర్తిస్తాయని పేర్కొన్నారు. మతాలకు అతీతంగా ఇక్కడ పుట్టిన వారందరూ హిందూస్‌గా పేర్కొంటారు. కాబట్టి హిందుస్తాన్ అనే పేరును చేర్చినా అభ్యంతరం లేదని కామత్ వాదించారు. అందుకే 'భారత్, ఇన్ ఇంగ్లీష్ ఇండియా' అని ఆ లైన్ మార్చాలని పట్టుబట్టారు.

కేవలం కామత్ మాత్రమే కాకుండా.. గోవింద్ దాస్, కమలాపతి త్రిపాఠి, కల్లూరు సుబ్బారావు, రామ్ సహాయ్, హర్ గోవింద్ పంత్ వంటి వారు 'భారత్' కోసం గట్టిగా వాదించారు. ఇండియా అనేది మన పూర్వికులు పెట్టిన పేరు కాదని గోవింద్ దాస్ అసెంబ్లీలో చెప్పారు. మన వేదాల్లో కూడా ఎక్కడా ఇండియా అని రాసుకోలేదని గుర్తు చేశారు. కేవలం మన దేశానికి వచ్చిన గ్రీకులు మాత్రమే 'ఇండియా' అని పిలవడం మొదలు పెట్టారని చెప్పుకొచ్చారు. అదే వేదాలు, ఉపనిషత్తులు గమనిస్తే 'భారత్' అనే పేరును విస్తృతంగా చూడవచ్చని చెప్పారు. మహాభారతం, పురాణాలతో పాటు చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ కూడా తన రచనల్లో మన దేశం పేరును 'భారత్'గానే పేర్కొన్నట్లు గుర్తు చేశారు.

విదేశాల్లో కూడా ఇండియాను భారత్‌గానే పిలుస్తారనిచెప్పారు. ఈ పేరును వెనుకబాటుతనానికి ప్రతీకగా చూడవద్దని.. కానీ మన దేశ చరిత్ర, సంస్కృతికి ప్రతిభింబంగా గుర్తించాలని కోరారు. మనం ఈ పేరు మీద ఒక అవగాహనకు రాకపోతే మన దేశ ప్రజలు అసలు స్వపరిపాలన అనే అంశానికి అర్థమే లేదని భావిస్తారని దాస్ గట్టిగా వాదించారు.

ఇండియా అనే పేరు సింధూ లేదా ఇండస్ అనే పదాల నుంచి వచ్చినట్లు కల్లూరు సుబ్బారావు చెప్పారు. హిందుస్తాన్ అనే పేరు పాకిస్తాన్‌కు అయితే సరిగ్గా సరిపోతుందని... ఇండస్ నది ఎక్కువగా ఆ దేశంలోనే ప్రవహిస్తుంది కాబట్టి మన దేశానికి పనికి రాదని చెప్పుకొచ్చారు. ఒక వేళ భారత్ అనే పేరును రాజ్యాంగంలో చేర్చాలని భావిస్తే.. హిందీ మాట్లాడే గోవింద్ దాస్ లాంటి వారు తమ భాషను 'భారతి'గా మార్చుకోవాలని సూచించారు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని కల్లూరు సుబ్బారావు విచిత్ర వాదన చేశారు.

గ్వాలియర్ ప్రాంతానికి చెందిన రామ్ సహాయ్ 'భారత్' అనే పేరును సమర్థించారు. గ్వాలియర్, ఇండోర్, మాల్వా ప్రాంతాలను కలిపి మధ్య భారత్ అని పిలుస్తున్నందు వల్ల.. దేశానికి భారత్ అని పేరు పెట్టడం సబబే అని చెప్పారు. మన మత గ్రంధాలు, హిందీ సాహిత్యంలో కూడా ఈ దేశాన్ని భారత్‌గానే అభివర్ణించారని గుర్తు చేశారు. మన నాయకులు కూడా దేశాన్ని భారత్‌గానే సంభోదిస్తున్న విషయాన్ని ఎత్తి చూపారు.

'భారత్, దటీజ్ ఇండియా' అనే వాక్యాన్ని చేర్చాలని కోరడంపై కమలాపతి త్రిపాఠి సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. రాజ్యాంగంలో ఇలా చేర్చడం అత్యంత ఆవశ్యకం అని చెప్పుకొచ్చారు. ఇది మన దేశ మనోభావాలను, ప్రతిష్టను సూచిస్తుందని చెప్పారు. వెయ్యేళ్లుగా బానిసత్వంలో ఉన్న మన దేశం.. ఇక్కడి ఆత్మను, చరిత్రను, ప్రతిష్టను, పేరు ప్రఖ్యాతులను కోల్పోయింది. అందుకే మన దేశానికి భారత్ అని పేరు పెట్టుకొని పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలని సూచించారు. పేరులోనే అంతా దాగి ఉంటుందని.. ఇది మన సంస్కృతిని, జీవనాన్ని ప్రతిబింభిస్తుందని త్రిపాఠి చెప్పారు. పైలోకంలో ఉన్న దేవతలు కూడా మన దేశం పేరును భారత్‌గానే గుర్తిస్తారని.. భరత భూమి ఒక పుణ్య దేశంగా పేర్కొంటారని ఆయన ప్రసంగించారు.

త్రిపాఠి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా.. బీఆర్ అంబేద్కర్ మధ్యలో కలగజేసుకొని.. ఇప్పుడిదంతా అవసరమా సార్.. మనం చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది అంటూ త్రిపాఠికి చెప్పారు. దీంతో అసెంబ్లీ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్.. త్రిపాఠి ప్రసంగాన్ని ఆపేశారు. అయితే హరగోవింద్ పంత్ తన అభిప్రాయాలను తెలియజేస్తూ.. మన దేశాన్ని జంబూ ద్వీపం, భారత్ వర్ష, భారత్ ఖండం, ఆర్యవర్తి వంటి పేర్లతో పిలుస్తామని అన్నారు. కాళిదాసు తన రచనల్లో భారత్ అనే పేరును ఉపయోగించారని చెప్పారు. దుశ్యంతుడు, శకుంతల కుమారుడి రాజ్యమైన భారత్ అని సంబోధించారని పేర్కొన్నారు. ఇండియా అనేది విదేశీయులు పెట్టిన పేరు మాత్రమే అని స్పష్టం చేశారు. అందుకే మన దేశానికి భారత్ అనే పేరే సరైందని తేల్చి చెప్పారు.

భారత్ అనే పేరుపై ఓటింగ్ నిర్వహించగా 38-51తో ఓడిపోయింది. కామత్ పెట్టిన సవరణ ప్రతిపాదన వీగిపోయింది. దీంతో చివరకు అంబేద్కర్ సవరణ బిల్లు ద్వారా 'ఇండియా, దటీజ్ భారత్' అనే వాక్యాన్ని ఆర్టికల్ 1లో ఉంచేశారు.

First Published:  6 Sept 2023 9:52 AM IST
Next Story